తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా పేరున్న బీఆర్‌ఎస్ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. తెలంగాణ ప్రజల గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన పార్టీగా కూడా బీఆర్‌ఎస్ పదే పదే చెబుతోంది. మరి అలాంటి పార్టీ, తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటే, ఆయనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఏకంగా ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటామని చెప్పడం గమనార్హం.
మేం ఎంత మంది ఉన్నామనేది ముఖ్యం కాదు అధ్యక్షా.. మా తెలంగాణ ప్రజల గొంతును వినిపిస్తున్నామా లేదా అనేది చూడండి. నాలుగు కోట్ల మంది ప్రజల గొంతుకగా మేం ఇద్దరమే ఇక్కడ ఉండొచ్చు. కానీ మేం నాలుగు కోట్ల మంది ఆశలకు సజీవ ఉదాహరణ. ప్రజల గొంతుకు మా గొంతుక వినిపిస్తున్నాం. మా మొర ఆలకించండి. అని 2010-11 మధ్య ఎంపీగా ఉన్న కేసీఆర్ లోక్‌సభ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెరమీదికి వచ్చాయి. దీనికి కారణం అప్పట్లో తెలంగాణ ప్రజల తరఫున లోక్‌సభలో విజయశాంతి, కేసీఆర్ ఇద్దరు మాత్రమే ఉన్నారు.
అయినా, తెలంగాణ సమాజం పరువు, ప్రతిష్ఠలకోసం పోరాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి నేత ఇప్పుడు తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు, తమకు ఉన్న నాలుగు ఓట్లను ఆయనకు వేయడానికి ముందుకు రాకపోగా తప్పుకోవడం తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు కాదా అనేది ప్రశ్న. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సర్వసాధారణం. కానీ పోరాడామా లేదా అనేది ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటామని చెప్పే కేసీఆర్ ఇప్పుడు ముఖం చాటేయడం ఎంత వరకు సమంజసం అనేది ప్రశ్న.
పైకి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే ఉద్దేశం లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో తెలంగాణ సమాజానికే చెందిన వ్యక్తి పోటీ చేస్తున్నారన్న విషయాన్ని కేసీఆర్ విస్మరించడం సరికాదని, రేపు ఇది కాంగ్రెస్‌కు ప్రధాన రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా, అంతర్గతంగా పార్టీలోనూ ఇదే తరహ చర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్, తెలంగాణకు చెందిన నేత పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి పోస్టుకు నిలబడినప్పుడు పోటీ నుంచి తప్పుకొన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్ఫూర్తి ఏమైందన్నది ప్రధాన ప్రశ్న.
Gulte Telugu Telugu Political and Movie News Updates