ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సీనియర్ నాయకులు పలువురు సోమవారం భేటీ అయ్యారు. ఆయన నిర్ణయం మేరకు ఈ ఎన్నికల్లో ఓటుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
“ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిది కాదని మాకు కూడా తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.
“అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండు తెలంగాణ సమాజానికి, రాష్ట్రానికి కూడా ద్రోహం చేశాయి. ప్రస్తుతం రైతులను రెండు పార్టీల ప్రభుత్వాలు మోసం చేశాయి. అందుకే ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన గుణపాఠం నేర్పాలనే దరంగా ఉన్నాం” అని కేటీఆర్ చెప్పారు.
కాంగ్రెస్ తరఫున సుదర్శన్ రెడ్డి, బీజేపీ తరఫున రాధాకృష్ణన్ బరిలో ఉన్నారని, అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఈ రెండు పార్టీలు రాజీపడుతున్నాయన్నారు. 78 లక్షల మందికి పైగా రైతులు ఇప్పుడు అగచాట్లు పడుతున్నారని, వారికి కనీసం ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సాయం అందించడం లేదన్నారు.
యూరియా సహా అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగానికి సంఘీభావంగా ఉండేందుకే తాము ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కేటీఆర్ తెలిపారు.
“ఒకవేళ నోటా ఉంటే దానికే తాము వేసేవారం. కానీ ప్రస్తుతం ఎన్నికల తీరు బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నారు. దీనిలో నోటా ఉండదు. ఈ క్రమంలో మేం ఎన్నికలకు దూరంగా ఉంటున్నాం. మాకు ఎవరూ బాస్‌లు లేరు, ప్రజలే మాకు బాస్‌లు. అందుకే ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం” అని వివరించారు.
సిగ్గుందా?
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “సీఎంకు సిగ్గుందా?” అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ తయారీ విషయంపై మహారాష్ట్ర పోలీసులు నెల రోజులుగా ఇక్కడ కార్మికులుగా చేరి ఈ గుట్టును ఛేదించారని, మరి రాష్ట్ర సర్కారు ఏమైందని ఆయన ప్రశ్నించారు.
“మీ ఈగల్ ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమైంది? మహారాష్ట్ర పోలీసులు వచ్చి నెల రోజులు ఇక్కడ ఆపరేషన్ చేస్తే ప్రభుత్వ యంత్రాంగం ఏమైంది? కనీసం మహా పోలీసులు రాష్ట్రానికి సమాచారం ఇవ్వలేదు” అని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates