బీఆర్ఎస్ కీలకనాయకుడు, ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆపార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురై.. చివరకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేశారని.. దోచుకున్నారని.. కానీ, తన తండ్రి కేసీఆర్‌ను మాత్రమే ప్రొజెక్టు చేస్తున్నారని ఆమె మీడియ ముందు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలోనే పార్టీ అధిష్ఠానం కవితపై చర్యలు తీసుకుని సస్పెన్షన్ వేటు వేసింది. ఇది జరిగిన తర్వాత.. హరీష్ రావు తాజాగా స్పందించారు.
అయితే.. ఆయన ఎక్కడా కవిత పేరును ప్రస్తావించలేదు. పైగా.. చాలా లైట్ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపించింది. “నాపై విమర్శలు చేసిన వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నా” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో నాపై ‘కొందరు’ ఆరోపణలు చేశారు.. అని మాత్రమే అని ఊరుకున్నారు. అంటే.. కవిత పేరును కూడా ఎత్తేందుకు హరీష్ రావు ఇష్టపడలేదని తెలుస్తోంది. దీంతో కవిత వ్యవహారాన్ని హరీష్ రావు లైట్ తీసుకున్నట్టు స్పష్టమైంది.
ఫలితంగా కవితకే ఈ వ్యవహారంలో డ్యామేజీ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. హరీష్‌రావు ఆమెలా.. ఎదురు దాడి చేసి ఉంటే.. అది వేరే చర్చకు అవకాశం ఇచ్చి ఉండేది. అలా కాకుండా తనపై వచ్చిన విమర్శలను ఆయన పట్టించుకోలేదు. నిజానికి పార్టీ అధినేత కుమార్తెగా కవిత చేసిన వ్యాఖ్యలకు చాలా ప్రాధాన్యం ఉంది. అయినప్పటికీ.. హరీష్‌రావు మాత్రం లైట్ తీసుకున్నారు. ఆమెను పన్నెత్తు మాట కూడా అనలేదు. పైగా ఆమె విజ్ఞతకే వదిలేశారు.
అంటే.. పరోక్షంగా కవిత చేసిన విమర్శలను కవితే నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు.. హరీష్‌రావుపై తెలంగాణ సమాజంలో ఉన్న సానుభూతి, సానుకూలతల నేపథ్యంలో కూడా ఆమె ఇరుకున పడ్డారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. జగదీశ్వర్‌రెడ్డిపై చేసిన ఆరోపణల తరహాలో.. ఆయన మాదిరిగానే హరీష్‌రావును కవిత ఊహించుకుని ఉంటారని, కానీ.. హరీష్‌రావుకు.. ఇతర నేతలకు చాలా తేడా వుందని అంటున్నారు. అందుకే.. కవిత విషయంలో ఎంత వరకు స్పందించాలో అంతే స్పందించి.. వదిలేశారని చెబుతున్నారు. తద్వారా ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు.. ఆమెకే ఎదురు నిలిచే అంశంగా మారాయని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates