బీజేపీ టైగర్.. బండి సంజయ్‌పై తిరుగుబావుటా

భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఎమ్మెల్యే అంటే రాజా సింగ్‌యే. బీజేపీ హిందుత్వ సిద్ధాంతాల్ని నరనరాన నింపుకుని ఉత్తరాదిన ఆ పార్టీ నాయకుల తరహాలో ఇక్కడ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాడు రాజా సింగ్. అందుకే ఆయనకు ‘టైగర్’ రాజా సింగ్ అని పేరు కూడా వచ్చింది.

పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా తనకు తానుగా చాలా చురుగ్గా వ్యవహరిస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే వ్యక్తి అతను. పార్టీకి చాలా విధేయుడిగా కనిపించే రాజా సింగ్.. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం టీఆర్ఎస్‌తో బీజేపీ హోరాహోరీగా తలపడుతున్న సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి వ్యతిరేకంగా వార్తల్లోకెక్కాడు. బండి సంజయ్ తనను మోసం చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడెలా ఉన్నప్పటికీ తన నియోజకవర్గ పరిధిలో మాత్రం తాను చెప్పిన వాళ్లకే టికెట్లు ఇవ్వాలని బండి సంజయ్‌కు ముందే చెప్పానని.. అందుకు సరే అన్న ఆయన.. ఇప్పుడు తనను మోసం చేసి వేరే వ్యక్తులకు టికెట్లు ఇచ్చాడని ఆరోపించాడు రాజా సింగ్. గోషా మహల్‌లో తనను ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఎంతో కష్టపడ్డ కార్యకర్తకు టికెట్ ఇప్పించుకోలేకపోయానని రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టికెట్ల కేటాయింపులో బండి సంజయ్ సహా పార్టీ సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. రెండు మూడు రోజుల్లో పార్టీ జాతీయ అధినాయకత్వానికి ఇక్కడి పరిస్థితులపై పూర్తి వివరాలతో లేఖ రాయబోతున్నానని బండి సంజయ్ వెల్లడించాడు. దుబ్బాక ఉప ఎన్నికల విజయం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా దూకుడుగా అధికార పార్టీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో పార్టీలో మంచి పేరున్న ఎమ్మెల్యే నుంచి ఇలాంటి విమర్శలు, ఆరోపణలు రావడం బీజేపీకి ఇబ్బందికరమే.