ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నట్టే .. రైతులు యూరియా, ఎరువుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలా జిల్లాల్లో అయితే.. అసలు యూరియా కొరత ఆకాశానికి అంటుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రాత్రి పూట కూడా ఎరువుల కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే పడుకుని నిద్ర చేస్తున్నారు. ఇది వాస్తవం. దీనిపై సీఎం చంద్రబాబు కూడా రెండు సార్లు సమీక్షించారు. రైతులకు సక్రమంగా అందించాలని కూడా ఆదేశించారు. అక్రమాలు చేస్తే.. ఊరుకునేది లేదని తాజాగా కూడా హెచ్చరించారు.
ఇలాంటి సమయంలో వ్యవసాయ మంత్రిగా బాధ్యతాయుత సీనియర్ నాయకుడిగా అచ్చెన్నాయుడు రైతులను ఊరడించే ప్రయత్నం చేయాలి. కానీ, ఆయన రైతుల సమస్యలను లైట్ తీసుకున్నారు. పత్రికల్లో వచ్చే కథనాలను ఊకదంపుడు ఉపన్యాసాలుగా తేల్చేశారు. ముఖ్యంగా రైతులు రాత్రివేళ్లలో కూడా.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలో ఉంటున్నారన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. బఫే భోజనానికి-యూరియాకు లింకు పెట్టి వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు దారితీసింది. మంత్రి చేసిన వ్యాఖ్యలపై రైతుసంఘాలు మండి పడుతున్నాయి. ఇదేనా మీ విధానం అంటూ.. రైతు సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
ఏమన్నారు..?
యూరియా కోసం.. ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. రైతులు రాత్రి పూట కూడా..యూరియా విక్రయ కేంద్రాల వద్ద.. పడిగాపులు పడుతున్నారని..అక్కడే పడుకుని ఎదురు చూస్తున్నారని, కనీసం తిండికూడా తినడం లేదని కథనాలు స్పష్టం చేశాయి. అయితే.. దీనిని బఫే భోజనంతో పోల్చిన మంత్రి అచ్చెన్న.. “మనం ఎవరి ఇంటికైనా భోజనానికి వెళ్తాం. పెట్టేవరకు వెయిట్ చేస్తాం.” అన్నారు. అంతటితో కూడా ఆగకుండా.. “బఫే భోజనం అయితే.. గుంపుగా వెళ్తే..ఎవరైనా పెడతారా? లైన్‌లో నిలబడి భోజనం తీసుకుంటాం. అలానే రైతులు కూడా క్యూలో ఉన్నారు. తప్పేముంది.” అనివ్యాఖ్యానించారు.
పోలికపైనే తంటా!
మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలలోని అంతరార్థం తప్పుకాకపోయినా.. ఆయన పోలికే సరికాదన్న వాదన వినిపిస్తోంది. బఫేతో పోల్చడం సరికాదని రైతులు చెబుతున్నారు. క్యూలో నిలబడి తీసుకోవడం వరకు సరైనదే అయినా.. ఇలా బఫే భోజనాలతో పోల్చడం ఏంటని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ప్రస్తుతం యూరియా కొరతతో రైతులు విలవిల్లాడుతున్నారని.. ఈ సమస్యలను పట్టించుకోకుండా.. విందు భోజనాల పేరుతో రైతులను అవమానిస్తారా? అనేది ప్రశ్న. ఇటీవల వైసీపీ నాయకులకు చీరలు పంపిస్తానని మంత్రి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనికి ముందు “ఆడబిడ్డ నిధిని” అమలు చేయాలంటే.. రాష్ట్రాన్ని అమ్మేయాలని అచ్చెన్న వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates