ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఆశేతు హిమాచలం.. ఆయనకు శుభాకాంక్షలు చెబుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు వరకు.. పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. ఎవరెలా స్పందించినప్పటికీ.. పవన్ కల్యాణ్ ప్రజాసేవలను వారు కొనియాడారు. మొక్కై వచ్చి.. మానై ఎదిగారంటూ.. విషెస్‌ను కుమ్మరించారు.
ప్రధాని ఏమన్నారు?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాదిమంది ప్రజల హృదయాల్లో పవన్ చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. ముఖ్యంగా.. ప్రభుత్వ పాలనలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసుకుని ప్రజలకు చేరువ అవుతున్నారని తెలిపారు. అదేసమయంలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేయడంలోనూ.. పవన్ అడుగులు బలంగా పడుతున్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు మాటిది..!
ఏపీ సీఎం చంద్రబాబు పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవన్‌ది అడుగడుగునా సామాన్యుడి పక్షం. అణువణువునా సామాజిక స్పృహ. మాటల్లో పదును. చేతల్లో చేవ.. మాటకు కట్టుబడే తత్వం. జన సైన్యానికి ధైర్యం. రాజకీయాల్లో విలువలకు పట్టం.. అన్నీ కలిస్తే పవనిజం“ అని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు.. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు. పాలన సహా రాష్ట్రాభివృద్ధిలో పవన్ కల్యాణ్ సహకారం మరువలేనిదని కొనియాడారు.
అన్నకు అభినందనం: లోకేష్
పవన్ కల్యాణ్‌ను అన్న అని సంభోదించే మంత్రి నారా లోకేష్.. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించిన పవన్ కల్యాణ్ `పీపుల్ స్టార్`గా ఎదిగారని పేర్కొన్నారు. నిరంకుశ పాలనను నేలమట్టం చేయడంలో ఎంతో కృషి చేశారని తెలిపారు. “ప్రజల కోసం తగ్గుతారు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు“ అని పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates