వైసీపీకి సవాల్ సబకు వచ్చేందుకు సిద్ధమా?: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు ఆయన గట్టి సవాల్ విసిరారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్ సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాను ఒంటరిగా వస్తున్నానని, కూటమి పార్టీలు మూకుమ్మడిగా వస్తున్నాయని, అయినా సిద్ధమేనని ఆయన ప్రస్తావించి ప్రజల మధ్యకు వెళ్లారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటి వరకు ఈ విషయంలో మౌనంగా ఉన్న చంద్రబాబు తాజాగా వైసీపీ నేతలకు సిద్ధం అనే పదంతో గట్టి సవాల్ విసిరారు.

సిద్ధం సిద్ధం అంటూ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా... మీరు సిద్ధమా? అని ప్రశ్నించిన చంద్రబాబు, వైసీపీ నాయకులు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా? అని అన్నారు. అంతేకాదు వైసీపీ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించేందుకు సిద్ధమా? అని నిలదీశారు.

ఇటీవల జరిగిన కడపలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని, దీనిపై చర్చకు తాము సిద్ధమేనని, మరి వైసీపీ నాయకులు కూడా సిద్ధమేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

అలాగే జగన్ బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్య, విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో జరిగిన కోడికత్తి డ్రామా, విజయవాడలో జరిగిన గులకరాయి నాటకాలపై కూడా చర్చకు తాము సిద్ధమేనని చెప్పారు. వైసీపీ నాయకులు కూడా సిద్ధమేనా? అని నిలదీశారు. దమ్ముంటే సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

సోమవారం ఆయన ఉమ్మడి కడప (ప్రస్తుతం అన్నమయ్య) జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. పలు దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి జీవనోపాధి గురించి వివరాలు అడిగారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, తన రాజకీయ జీవితం 45 ఏళ్లు దాటిపోయిందని చెప్పారు. ఏనాడూ తాను విశ్రాంతి తీసుకోలేదని, నిరంతరం పేదలు, ప్రజల కోసం, రాష్ట్రం కోసం శ్రమించానని తెలిపారు. తన కుటుంబాన్ని కూడా విస్మరించి ప్రజల కోసం పనిచేశానన్నారు.

పేదలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని పేర్కొన్నారు. దివ్యాంగుల విషయంలో మరిన్ని పథకాలు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, ఆదాయం పెరగాలని చెప్పారు. దీనికి సంబంధించి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. సంపద సృష్టి జరుగుతోందని, దానిని పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు.