హరీశ్..ఇది ఆరడుగుల బుల్లెట్టు: బీఆర్ఎస్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాజకీయ మంటలు రేగిన వేళ… బీఆర్ఎస్ కీలక నేత, కాళేశ్వరం నిర్మాణ సమయంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును ఆ పార్టీ ఓ రేంజిలో ఎలివేట్ చేసింది. హరీశ్ ను ఆరడుగుల బుల్లెట్టుగా ఆ పార్టీ అభివర్ణించింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని రూలింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత… ఆ అవినీతికి హరీశే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వచ్చిన వెంటనే క్షణాల్లోనే స్పందించిన బీఆర్ఎస్ హరీశ్ ను ఆరడుగుల బుల్లెట్టుగా అభివర్ణించింది.

హరీశ్ ను ఆరడుగుల బుల్లెట్టుగా అభివర్ణించిన బీఆర్ఎస్… ఆయనను సింహంతోనూ పోల్చింది. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లుగా కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన నేతగానూ ఆయనను ఆ పార్టీ ఆకాశానికెత్తేసింది. మొత్తంగా ఈ పోస్టుతో కవితను అలా వదిలేసిన పార్టీ అధిష్ఠానం.. హరీశ్ రావును మాత్రం దూరం చేసుకునేది లేదన్న వాదనను బలంగా వినిపించిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. సొంత కూతురు అయినప్పటికీ కవిత చాలా కాలంగా కేసీఆర్ కు చేరువ కాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాగృతిని బేస్ చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్న కవిత తరచూ సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ సాగుతున్నారు.

సాధారణంగా బీఆర్ఎస్ కు హరీశ్ రావు ఓ నిఖార్సైన యోధుడేనని చెప్పక తప్పదు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన హరీశ్… తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. కేసీఆర్ ఏ పని చెప్పినా ఇట్టే చేసేసుకుని వచ్చే హరీశ్.. పాలనపైనా మంచి పట్టు సాదించారు. అసలు హరీశ్ రావు లేని బీఆర్ఎస్ ను ఊహించుకోవడం కష్టమేనని చెప్పక తప్పదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొన్ని అంశాలపై ఓ మోస్తరు అవగాహన ఉన్నా… సాగునీటి శాఖ, ఆర్థిక శాఖ లాంటి కీలక శాఖలపై అంతగా పట్టు లేదనే చెప్పాలి. ఈ కారణంగా తన కుమార్తెను లండన్ వర్సిటీతో చేర్పించాల్సి ఉన్నా… అసెంబ్లీ సమావేశాల కారణంగా ఓ రోజు ఆలస్యంగా ఆయన తన కుమార్తెను తీసుకుని వెళ్లారు.

హరీశ్ రావు సోమవారం తెల్లవారుజామున అలా లండన్ ఫ్లైట్ ఎక్కితే… అప్పటికే అమెరికా నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన కవిత.. సోమవారం మధ్యాహ్నం దాటిన తర్వాత నేరుగా హరీశ్ నే టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్ కు పాత్ర లేదా? అంటూ మొదలుపెట్టిన కవిత… ఏకంగా తన తండ్రికి అవినీతి మరకలు అంటించింది హరీశేనని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సీఎం రేవంత్ తో హరీశ్ రావు అంటకాగుతూ తనను తాను రక్షించుకుంటున్నారని కూడా కవిత మరో కీలక ఆరోపణ చేశారు. ఈ ఆరోపణలపై వేగంగా స్పందించిన బీఆర్ఎస్ సింగిల్ పోస్టుతో ఆమె వ్యాఖ్యలకు సమాధానం చెప్పేసింది.