జ‌గ‌న్‌కు అయ్య‌న్న‌ అప్పీల్‌.. ఏమ‌న్నారంటే!

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష‌ (ప్ర‌ధాన కాదు) నాయ‌కుడు జ‌గ‌న్‌కు అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కీల‌క సూచ‌న చేశారు. అసెంబ్లీకి రావాల‌ని ఆయ‌న‌ను మ‌రోసారి కోరారు. అంతేకాదు.. స‌భ‌కు వ‌స్తే మాట్లాడే స‌మ‌యంలో ఇస్తామ‌న్నారు. స‌భ‌కు రాకుండా ప్రెస్ మీట్లు పెట్టే సంప్ర‌దాయాన్ని సృష్టించ‌వ‌ద్ద‌ని, ఇది ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ద‌తి కాద‌ని వ్యాఖ్యానించారు.

వ‌చ్చే నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయ‌ని, ఈ స‌భ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అయ్య‌న్న పాత్రుడు జ‌గ‌న్‌కు సూచించారు. త‌న సూచ‌న‌లు పాటించాల‌ని అన్నారు.

గ‌తంలో మాదిరిగా స‌భ‌ల‌కు రాకుండా ప్ర‌శ్న‌లు అడిగే సంస్కృతికి ఈ ద‌ఫా చెక్ పెడుతున్న‌ట్టు అయ్య‌న్న పాత్రుడు తేల్చిచెప్పారు. గ‌త ఏడాది కాలంలో స‌భ‌కు రాని వైసీపీ ఎమ్మెల్యేలు లిఖిత పూర్వ‌కంగా ప్ర‌శ్న‌లు అడిగారు. దీనికి స‌భ‌లో స‌మాధానాలు కూడా చెప్పారు. కానీ స‌భా సంప్ర‌దాయాల ప్ర‌కారం స‌భ‌కు రాని వారు అడిగే ప్ర‌శ్న‌ల‌ను ఇక‌పై అనుమ‌తించేది లేద‌ని తెలిపారు. కాబ‌ట్టి స‌భ‌కు వ‌చ్చి హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని అయ్య‌న్న సూచించారు. ఏ ప్ర‌శ్న అడిగినా ప్ర‌భుత్వ ప‌క్షం స‌మాధానం చెబుతుంద‌ని, తాను కూడా పూర్తి స్వేచ్ఛ ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఇక వ‌చ్చే నెల‌లో తిరుప‌తిలో మ‌హిళా పార్ల‌మెంటును నిర్వ‌హిస్తున్న‌ట్టు అయ్య‌న్న పాత్రుడు పేర్కొన్నారు. 14, 15 తేదీల్లో తిరుప‌తి వేదిక‌గా ఈ స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌న్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీల‌లోని మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఆహ్వానాలు పంపుతున్నామ‌న్నారు. ఆయా రాష్ట్రాల‌కు చెందిన సుమారు 300 మందికిపైగా మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రు కానున్న‌ట్టు తెలిపారు.

త‌ద్వారా ఆయా రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్న చ‌ట్టాలు, స‌భా సంప్ర‌దాయాలు పంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, మ‌రింత మెరుగ్గా స‌భ‌ల‌ను న‌డిపించేందుకు సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అయ్య‌న్న వివ‌రించారు.

ఈ స‌ద‌స్సుకు వైసీపీకి చెందిన మ‌హిళా ఎమ్మెల్యేల‌ను కూడా ఆహ్వానిస్తున్న‌ట్టు అయ్య‌న్న పాత్రుడు తెలిపారు. అంద‌రూ రావాల‌ని కోరిన‌ట్టు చెప్పారు. రాజ‌కీయాలు వేరేగా చేసుకోవాల‌ని, స‌భా సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు తెలుసుకుంటే భ‌విష్య‌త్తులో ఉత్త‌మ ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎదగ‌వ‌చ్చ‌ని, ప‌దిమందికి ఆద‌ర్శంగా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

గ‌తంలో 2014-19 మ‌ధ్య స్పీక‌ర్‌గా వ్య‌వ‌హరించిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా మ‌హిళా పార్ల‌మెంటును నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడే ఈ త‌ర‌హా కార్య‌క్ర‌మానికి కూట‌మి ప్ర‌భుత్వం శ్రీకారం చుట్ట‌డం గ‌మ‌నార్హం.