జనసేన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తానంటూ ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ప్రకటించారు. వచ్చే 10 సంవత్సరాల్లో అన్నీ అనుకూలిస్తే జనసేన జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే అసలు జాతీయ పార్టీగా ఆవిర్భవించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు వచ్చిందీ ఆ ఆలోచన? అనేది కీలక విషయం. ప్రస్తుతం ఉన్న టీడీపీ కూడా జాతీయ పార్టీగానే నమోదైంది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలలో పార్టీకి సభ్యత్వం ఉంది.
కానీ ఆయా రాష్ట్రాల్లో టీడీపీ యాక్టివిటీ ఎలా ఉందో తెలుస్తూనే ఉంది. ఏపీలోనే పార్టీ నేతలను అదుపులో పెట్టే పరిస్థితి లేదని అనుకూల మీడియానే చెబుతున్న సమయంలో, ఇతర రాష్ట్రాల్లో పార్టీని నడిపించే పరిస్థితి కనబడటం లేదు.
సరే.. జనసేన విషయానికి వస్తే జాతీయ పార్టీ ఆశలు బాగానే ఉన్నాయి. దీనికి కావాల్సిన ప్రాతిపదిక ఏంటి? అనేది చూస్తే కేంద్రంలో చక్రం తిప్పాలన్నది పవన్ కళ్యాణ్ అభిమతమని స్పష్టంగా తెలుస్తోంది. దీనికి బీజేపీ ప్రోత్సాహం కూడా కీలకంగా ఉంది.
వాస్తవానికి బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమే జనసేన జాతీయ పార్టీగా ప్రకటన వెనుక ఉందన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. బీజేపీకి ఎక్కడ సత్తా లేదో అక్కడ జనసేన ఆవిర్భవిస్తుందన్నది వారి మాట.
తమిళనాడులో జనసేన ఆవిర్భావం కొన్ని నెలల్లోనే కనిపించనుంది. వచ్చే ఏడాది అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల నుంచే జనసేన పని ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ నటుడు దళపతి విజయ్ పార్టీ జెండా ధరించడం వెనుక పవన్ వ్యూహం ఇదేనని చెబుతున్నారు.
బలమైన స్థానిక పార్టీలను జాతీయ పార్టీలుగా అవతరించేలా చేయడంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. గతంలో అసోం గణ పరిషత్ విషయంలోనూ ఇదే జరిగింది. తమకు అలివికాని చోట వేరే పార్టీని పురమాయించడం ద్వారా తమ పనులు సాకారం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు జనసేన కూడా ఈ జాబితాలో ఉందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
అయితే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించడం మంచిదే. కాబట్టి జనసేన అధినేత ప్రయత్నాలు ఫలిస్తే, తెలుగు నేలపై ఆవిర్భవించిన పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పితే మంచిదే కదా!
Gulte Telugu Telugu Political and Movie News Updates