విశాఖ రాజకీయాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గత రెండు మాసాల కిందట విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌ను కూటమి కైవసం చేసుకున్న దరిమిలా సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవహారాలు, రాజకీయాలపై జిల్లాకే చెందిన పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావుతో అంతర్గతంగా చర్చించారు. విశాఖలో పర్యటించిన చంద్రబాబు నగరానికి సంబంధించిన డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులతో ఆయన అంతర్గతంగా చర్చించారు.
ఈ చర్చల్లో ప్రధానంగా విశాఖలో వైసీపీ దూకుడుపై చంద్రబాబు ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “అంతా బాగానే ఉంది కదా?” అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. నిజానికి విశాఖలో కూటమి నేతల హవానే నడుస్తున్నప్పుడు చంద్రబాబుకు ఈ సందేహం రావడం ఆసక్తిగా మారింది. కానీ క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య వివాదాలు సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త విషయంలో టీడీపీ నాయకులు రెండుగా చీలిపోయారు.
వైసీపీ హయాంలో ఆయనపై అనేక మంది ఆరోపణలు చేశారు. భూములు ఆక్రమించారని, దోచుకుంటున్నారని చెప్పుకొచ్చారు. దీనికి జనసేన నాయకులు కూడా తోడయ్యారు. కానీ కూటమి వచ్చిన తర్వాత తెరవెనుక ఏం జరిగిందో ఏమో, వైసీపీ నాయకుడి గురించి టీడీపీలోనే నాయకులు చీలిపోయారు. ఒక వర్గం ఆయనకు మద్దతుగా మాట్లాడుతుండగా మరో వర్గం ఆయనను విభేదిస్తోంది. అయితే వ్యతిరేక వర్గంలో ఉన్న నాయకులపై అనుకూల వర్గం నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ కారణంగానే విశాఖలో టీడీపీ నేతల మధ్య వివాదాలు పొడచూపాయి. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే ఆయన “అంతా బాగానే ఉందా?” అనే విషయంపై ఆరా తీశారు. ప్రస్తుతం వైసీపీ నాయకుల గళం ఎక్కడా వినిపించడం లేదు. పైగా మాజీ మంత్రి అమర్నాథ్ మరింత సైలెంట్ అయ్యారు. ఇతర నాయకులు కూడా మౌనంగా ఉన్నారు. దీని వెనుక జరిగిన పరిణామాలు వేరే ఉన్నా ప్రస్తుతం విశాఖలో కూటమిని ప్రశ్నించే వారు, వ్యతిరేకించే వారు కూడా కనిపించడం లేదు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు చంద్రబాబు నాయకులతో చర్చించారు. దీనికి వారు ఔనంటూ సమాధానం ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates