ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. దసరా పండుగ తర్వాత.. జనసేన తరఫున `త్రిశూల్` కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న `సేనతో సేనాని` కార్యక్రమంలో చివరి రోజు శనివారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తు పార్టీ వ్యూహాలను ఆవిష్కరించారు. విశాల దృక్ఫథం ఉన్న యువతకు పార్టీ పెద్దపీట వేస్తుందన్నారు. పదవుల కోసం, ఆర్జన కోసం కాకుండా.. దేశం కోసం. ప్రజల కోసం పనిచేసేవారు ముందుకు రావాలని సూచించారు.
ఈ క్రమంలో యువతకు పెద్దపీట వేసేందుకు త్రిశూల్ కార్యక్రమాన్ని దసరా తర్వాత ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. రాజకీయాలంటే.. అనేక ఆటుపోట్లు ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. సంపాదన ఏమీ ఉండదని.. ప్రజలకు నిరంతరం స్ఫూర్తి మంతంగా పని చేయాలన్న కర్తవ్య దీక్ష అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న క్రియాశీలక సభ్యులకు ఐడీ కార్డులు విభిన్నంగా ఉంటాయన్నారు. పార్టీనాయకులు, కార్యకర్తలతో మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. పార్టీని మరింత సంస్థాగతంగా ముందుకు తీసుకువెళ్లడంలో కార్యకర్తల పాత్ర ఉంటుందన్నారు.
తనకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఆహ్వానాలు పలుకుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల తమిళనాడులో బీజేపీ నాయకులు ఆయనను ఆహ్వానించిన విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే.. తాను ఏపీలో నిలదొక్కుకునేందుకే.. దాదాపు 12 సంవత్సరాలు పట్టిందని వారికి చెప్పినట్టు తెలిపారు. కేంద్రంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని.. వాటిని వినియోగించి రాష్ట్రానికి మేలు జరిగేలా చేస్తున్నట్టు చెప్పారు. నల్లమలలో తవ్వకాల కోసం కొందరు ప్రయత్నించినప్పుడు అక్కడి చెంచులు.. తన వద్దకు వచ్చి అభ్యర్థించారని, తమ జీవనాధారమైన అడవితల్లిని తమకు దూరం చేస్తున్నారని మొర పెట్టుకున్నట్టుతెలిపారు. ఈ సమయంలో వారికి అనుకూలంగా స్పందించానన్నారు.
ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. రాజకీయాల్లో కేవలం ప్రకటనలు చేయడమే కాదని.. పనులు కూడా చేయాలని పరోక్షంగా వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఇక, పార్టీలో ఉన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసేవారికి తగిన గుర్తింపు లభిస్తుందని.. అప్పుడే ఎదుగుతారని చెప్పారు. తమకు పదవులు రాలేదని.. బాధ పడితేనో.. నాయకుల చుట్టూ తిరిగితేనో.. తనపై నిందలు వేస్తేనో..పదవులు రావని తెగేసి చెప్పారు. జనసేన పార్టీని దేశం కోసం పెట్టామని, కులం కోసం కాదని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గుర్రం జాషువా చెప్పినట్టు `విశ్వనరుడి`నని వ్యాఖ్యానించారు. కేవలం ఒక కులానికి మాత్రమే పనిచేసి ఉంటే.. పార్టీ కుల పార్టీ అయ్యేదని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates