తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము సభలో సహకరిస్తామని చెప్పారు. ఏ విషయంపైనైనా అర్థవంతమైన చర్చలు చేపట్టేందుకు పూర్తిగా సహకారం ఉంటుందని తెలిపారు. అయితే సభ విషయంలో తాము సూచించినట్టు నిర్ణయాలు తీసుకోవాలని షరతులు విధించారు. సభను కేవలం మొక్కుబడిగా నాలుగు రోజులు నిర్వహించి చేతులు దులుపుకోవద్దన్నారు.
కనీసం రెండు మూడు వారాలైనా సభను నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగ సమస్యలు, యూరియా, కేంద్రం వైఖరిపైనా సభలో చర్చకు పెట్టాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు క్షోభను అనుభవిస్తున్నారని, “ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం రా” అని అలమటిస్తున్నారని చెప్పారు. “కేసీఆర్ సార్ ఉండి ఉంటే అన్నీ సక్రమంగా జరిగేవి కదా” అని గ్రామాల్లో చర్చ నడుస్తోందన్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమేనని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
యూరియా ఎక్కడికి పోయింది!
కేంద్రం నుంచి యూరియా వచ్చిందని కానీ దీనిని ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే యూరియాను బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. విత్తనాలు లేవని, నీరు కూడా లేదని రైతులు అగచాట్లు పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై సభలో చర్చ పెడతామని చెప్పారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. రుణమాఫీ అటకెక్కించారని దుయ్యబట్టారు. ఇలా ఎందుకు మోసం చేశారో వివరణ ఇవ్వాలని పట్టుబడతామన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక చదువులు ఆగిపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నాయని, ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. ఈ విషయాలపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. “కాళేశ్వరం పై చర్చ పెట్టొద్దు, ప్రజల కష్టాలపై చర్చ పెట్టండి” అని వ్యాఖ్యానించారు. దీనికి ముందు ఆయన గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates