వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను ఏం చేయాలన్న విషయం కూటమి ప్రభుత్వానికి కొరుకుడు పడడం లేదు. ప్రభుత్వం మారి 15 మాసాలు అయినప్పటికీ.. ఇప్పటికీ ఈ విషయం బ్రహ్మపదార్థంగానే మారిపోయింది. అలాగని వదలేస్తే.. ఈ నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించిన సమయంలో ఇక్కడ సీలింగ్ పెచ్చులు ఊడిన పరిస్థితి కనిపించింది.
అదేవిధంగా గోడలు కూడా చెమ్మెక్కాయి. గదుల్లో బూజు పట్టింది. ఇలా.. నిర్మాణం దెబ్బతింటోంది. ఈ క్రమంలో దీనిని తక్షణం ఏదో ఒక విధంగా వినియోగించుకోక తప్పదని నిర్ణయానికి వచ్చిన కూటమి సర్కారు.. తాజాగా.. ఈ విషయంపై అధ్యయనం చేయాలని భావించింది. ఈ క్రమంలో రుషికొండ ప్యాలెస్‌ను ఏవిధంగా వినియోగంలోకి తెచ్చుకోవాలన్న విషయంపై పరిశీలన చేసేందుకు.. మేధావులతో చర్చించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ.. ఈ ప్యాలెస్‌లో పర్యటించి.. నిర్మాణాలను పరిశీలించి.. సరైన విధంగా వినియోగించే మార్గాలపై పరిశీలించనుంది. అదేవిధంగా సిఫార్సులు చేయనుంది. ఈ మంత్రుల బృండంలో జనసేన నుంచి కందుల దుర్గేష్, టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. వీరితో పాటు.. విశాఖకు చెందిన పలువురుఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉండనున్నారు. ఈ మంత్రుల కమిటీనే స్థానిక నేతలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఏం చేస్తారు?
మంత్రుల కమిటీ.. మూడు రూపాల్లో ఈ ప్యాలెస్‌ను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై అధ్యయనం చేయనుంది. అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. దీనికి సమయం అంటూ ఏమీ లేదు. రెండు మాసాలు.. మూడు మాసాలు ఎంతైనా సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా దీనిని 1) ప్రైవేటుకు అప్పగించాలా? 2) పర్యాటక కట్టడంగా గుర్తించి ప్రజలకు ప్రవేశం కల్పించాలా? 3) రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకోవాలా? అనే విషయాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీనిలో మేధావులు, స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates