వైసీపీ సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై హైకోర్టు సీరియస్ అయింది. వారిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
ప్రస్తుతం వారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారని, అందుకే అరెస్టు చేయలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అయితే తాము బెయిల్ ఇవ్వలేదని, అలాంటప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని హైకోర్టు నిలదీసింది. అనంతరం పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఏం జరిగింది?
మూడు నెలల క్రితం మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. వీరిని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొందరు నేతలు పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారని పోలీసులు గుర్తించారు.
ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల సహకారం కూడా ఉందని సాక్షుల ద్వారా తేలడంతో వారిపై కూడా కేసు నమోదైంది. ఈ రెండు హత్య కేసుల్లో వారిని అరెస్టు చేయాల్సి ఉంది. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే పిన్నెల్లి సోదరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ విచారణలో ఉందన్న కారణంగా వారిని అరెస్టు చేయలేదు. ఇదిలావుంటే, శుక్రవారం వీరి ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టులో విచారణకు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల వైఖరిని తప్పు పడుతూ పిటిషన్లను కొట్టి వేసింది. దీంతో పోలీసులు పిన్నెల్లి సోదరులను అరెస్టు చేసేందుకు అవకాశం ఏర్పడింది. మరోవైపు, ఇద్దరు సోదరులు రాష్ట్రం నుంచి పరారయ్యారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఏంటీ హత్య కేసు?
మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తిలో టీడీపీ స్థానిక నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు హత్యకు గురయ్యారు.
మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య (302) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఏ1: జవిశెట్టి శ్రీను ఎలియాస్ బొబ్బిలి
ఏ2: తోట వెంకట్రామయ్య
ఏ3: తోట గురవయ్య
ఏ4: దొంగరి నాగరాజు
ఏ5: తోట వెంకటేశ్వర్లు
ఏ6: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ఏ7: పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి
అయితే పిన్నెల్లి సోదరులను మాత్రం అరెస్టు చేయలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates