జిల్లాకో విధంగా పవర్ సెంటర్లు ఏర్పడ్డాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నామినేటెడ్ పదవులు తర్వాత జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాము చెప్పిన వారికి పనులు చేయాలని నామినేటెడ్ పదవులు తీసుకున్నవారు కోరుతుండగా, తమ నియోజకవర్గంలో తమ మాటను కాదని పనులు చేయడానికి వీలులేదని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు.
ఎక్కువగా ఇది టిడిపిలోనే కనిపిస్తుండటం, పవర్ కేంద్రాలుగా మారడంతో అధికారులకు ఎవరి పని చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొంతమంది సిఫార్సు చేస్తే వాటిని అనంతపురం ఎంపీ నిలుపుదల చేయించడం వివాదంగా మారింది. ఇటీవల చంద్రబాబు వరకు ఇది చేరింది. అనంతపురం అర్బన్ రాజకీయాలు గత కొన్నాళ్లుగా వేడెక్కాయి. వివాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు ఇటు పార్టీలోనూ అటు వ్యక్తిగతంగా కూడా నాయకులకు ఇబ్బందిగా మారింది.
దీనికి ప్రధాన కారణం ఈ పవర్ సెంటర్ల వల్లేనని పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ఇక తిరుపతిలోనూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన ఎమ్మెల్యే మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. అలాగే ఏలూరు ఎంపీకి అక్కడ ఉన్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య ఇదే తరహా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ పార్లమెంటు స్థానంలో నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎంపీ-ఎమ్మెల్యేల మధ్య అంతర్గత కుమ్ములాట కొనసాగుతోంది. తమ పనులను చేయడం లేదని, తమ ప్రాంతాల్లో పనులను అడ్డుకుంటున్నారనేది ఆయా నియోజకవర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
పార్టీ కోసం తాము ఎంతో కష్టపడి పనిచేసామని, మధ్యలో పార్టీలోకి వచ్చి పదవులు సంపాదించుకుని ఇప్పుడు తమపైనే తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారనేది అటు నాయకులు ఇటు సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. ఈ వివాదాలు ఇలాగే కొనసాగుతాయా లేకపోతే చంద్రబాబు జోక్యం చేసుకుని వాటిని తగ్గిస్తారా అనేది చూడాల్సి ఉన్నప్పటికీ నాయకులైతే మారాల్సిన అవసరం కనిపిస్తోంది.
జిల్లాకో విధంగా రెండు పవర్ సెంటర్లు ఏర్పడి, ఎవరి పరిస్థితులు వారు గుర్తించకుండా, ఎవరి స్థాయిలు వాళ్లు గుర్తించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది ప్రభుత్వంలో ఉన్న పార్టీకి తీవ్ర ఇబ్బందికర పరిణామంగా మారుతుంది. దీనివల్ల అంతిమంగా ప్రజలకు ఎలాంటి మేలు కలగకపోగా వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయా నియోజకవర్గాలు కేంద్రంగా మారుతున్నాయి.
జిల్లాకో విధంగా ఉన్న ఈ పరిస్థితులను మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల నాటికి మరింత ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీకాకుళంలో మంత్రి అచ్చం నాయుడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రి కొల్లు రవీంద్ర ఇదే తరహా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తమ మాటే నెగ్గాలని సొంత పార్టీ నాయకులు, కూటమిలో ఉన్న అందరినీ కలుపుకుని వెళ్లాలని మంత్రులు చేస్తున్న ఆలోచన విభిన్నంగా మారడంతో ఈ వివాదాలకు అంతుపంతు లేకుండా పోయింది.
భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates