రిజ‌ర్వేష‌న్ల‌పై ముందుకే..: కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యం

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే విష‌యంలో ముందుకే వెళ్లాల‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్పటి వ‌ర‌కు దీనిపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోద ముద్ర వేయ‌క‌పోయినా.. గ‌వ‌ర్న‌ర్ ఆర్డినెన్సుకు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకోక‌పోయినా.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో దీనిని అమ‌లు చేసి తీరాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో అమ‌లుకు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్టు చెప్పారు. న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర్కొనే అంశంపై దృష్టి పెట్టిన‌ట్టు తెలిపారు. అయితే.. ఎవ‌రూ విభేదించే అవ‌కాశం లేనందున‌.. అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న ట్టు వివ‌రించారు.

ఈ వ్య‌వ‌హారంలో న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు, రేపు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే ఎలా ముందుకు సాగాల‌న్న అంశాల‌పై పార్టీ సీనియ‌ర్ నేత‌, సుప్రీంకోర్టు న్యాయ‌వాది అభిషేక్ సింఘ్వీని భ‌ట్టి విక్ర‌మార్క స‌హా.. ప‌లువురు నేత‌లు క‌లుసుకున్నారు. ఆయ‌న‌తో రెండు గంట‌ల పాటు చ‌ర్చించారు. రాష్ట్ర‌ప‌తి నుంచి ఆమోదం ల‌భించ‌క‌పోయినా.. ఆర్డినెన్సుకు అవ‌కాశం లేక‌పోయినా.. రిజ‌ర్వేష‌న్‌లు అమ‌లు చేయొచ్చా.. లేదా.. గ‌తంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయా? అనే విష‌యాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్టు భ‌ట్టి చెప్పారు. అన్నీ సానుకూలంగానే ఉన్నాయ‌ని.. బీసీల‌ను వ్య‌తిరేకించేవారు మాత్ర‌మే కోర్టులో న్యాయ‌ప‌ర‌మైన పోరాటాల‌కు దిగుతార‌ని.. దానిని రాజ‌కీయంగానే చూస్తామ‌ని వ్యాఖ్యానించారు.

ఈ క్ర‌మంలో రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని భ‌ట్టి చెప్పారు. ఒక‌వేళ న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తే.. పార్టీ ప‌రంగా అయినా.. రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేసి తీరుతామ‌ని భ‌ట్టి వివ‌రించారు. ఈ విష‌యంలో బీసీల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని అమ‌లు చేస్తామ‌ని భ‌ట్టి పేర్కొన్నారు. కుల గ‌ణ‌న అనంత‌రం..రాష్ట్రంలో 42 శాతంగా ఉన్న బీసీల‌కు న్యాయం చేయాల‌న్న‌దే త‌మ సంక‌ల్ప‌మ‌ని వివ‌రించారు. కానీ, దీనిని కూడా కొంద‌రు నాయ‌కులు, ఒక పార్టీ(బీజేపీ) జీర్ణించుకోలేక పోతున్నాయ‌న్నారు. వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతార‌ని వ్యాఖ్యానించారు. “మా వ‌ర‌కు స్ప‌ష్టంగా ఉన్నాం. కోర్టుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. దీనిని అమ‌లు చేయాల‌ని భావిస్తున్నాం. ఖ‌చ్చితంగా ఆచ‌ర‌ణ‌లోకి తీసుకువ‌స్తాం.” అని భ‌ట్టి వివ‌రించారు.

స్థానికంపై తెగ‌ని నిర్ణ‌యం

తెలంగాణ హైకోర్టు ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో స్థానిక సంస్థ‌ల‌ను ఎప్పుడు నిర్వ‌హించాల‌న్న విష‌యంపై పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ ఇంకా నిర్ణ‌యానికి రాలేద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. దీనిపై మ‌రోసారి ఈ నెల 30న భేటీ నిర్వ‌హించ‌నున్నట్టు తెలిపారు. త్వ‌ర‌లోనే కోర్టు తీర్పున‌కు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకుంటామ‌ని.. స్థానిక సంస్థ‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజ‌య‌మ‌ని వ్యాఖ్యానించారు. అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని, కేసీఆర్ హ‌యాం కంటే ప్ర‌జ‌లు ఇప్పుడే సంతోషంగా ఉన్నార‌ని తెలిపారు. ప్ర‌జ‌లు సీఎం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నార‌ని చెప్పారు. స్థానిక ఎన్నిక‌ల‌కు భ‌య ప‌డుతున్నార‌న్న విప‌క్షాల ఆందోళ‌న‌ను తాము ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.