జనసేన… తెలుగు నేలలోని దాదాపుగా అన్ని పార్టీల కంటే కూడా చిన్న వయసు కలిగిన పార్టీగానే చెప్పాలి. అయినా కూడా పార్టీ నియావళిని పకడ్బందీగా అమలు చేసే విషయంలో అధిష్ఠానం ఓ స్పష్టమైన గీత గీసుకున్నట్టుంది. పార్టీ నియమావళి దాటిన వారు పెద్ద వారైనా, చిన్నవారైనా… అసలు పార్టీలో వారి స్థాయి ఏదైనా కూడా సస్పెన్షన్ వేసేయాల్సిందేనని ఆ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది కట్టుదాటిన నేతలను సస్పెండ్ చేసిన పార్టీ అధిష్ఠానం… తాజాగా సోమవారం వివాదం రేపిన మచిలీపట్నం పరిధిలోని పార్టీ క్రియాశీల కార్యకర్త కర్రి మహేశ్ ను పార్టీ సస్పెండ్ చేసింది.
కర్రి మహేశ్ ఏం చేశారన్న విషయానికి వస్తే..మచిలీపట్నం వాస్తవ్యుడైన ఆయన ఆదివారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న హోంగార్డ్ ను అడ్డగించారు. అంతటితో ఆగకుండా ఆ హోంగార్డ్ పై దాడికి దిగారు. ఈ దృశ్యాలు సోమవారం ఉదయానికంతా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన వెంటనే మచిలీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బండి రామకృష్ణ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎవరైతే ఏమిటీ.. పార్టీ లైన్ దాటితే వేటే అని పార్టీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చాయి. దీంతో కర్రి మహేశ్ పై రామకృష్ణ సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కర్రి మహేశ్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపనే లేదని చెప్పారు. అయితే వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, హోంగార్డ్ చెబుతున్న వివరాలను ఆధారంగా చేసుకుని మహేశ్ పై చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయినా పార్టీకి నష్టం చేకూర్చే వాళ్లంటే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అసలు ఇష్టం ఉండదన్నారు. ఈ కారణంగానే తిరుపతి, రాజమహేంద్రవరం ఘటనల్లో పార్టీ నేతలపై పవన్ వేగంగా చర్యలకు ఆదేశించారని, వారిని ఏకంగా సస్పెండ్ చేశారని తెలిపారు. ఈ తరహా చర్యలు రాజకీయాల్లో సచ్ఛీలతకు మార్గంగా నిలుస్తాయని ఆయన చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates