అయ్య‌న్నకు ఆగ్ర‌హం.. స‌ర్కారు సీరియ‌స్‌!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.. ఉన్న‌ది ఉన్న‌ట్టుమొహంపైనే మాట్లాడే నాయ‌కుడు. స్పీక‌ర్‌గా ఉన్నా.. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసినా.. ప్ర‌తిప‌క్షంలో కూర్చున్నా.. ఆయ‌న స్ట‌యిల్ మాత్రం ఆయ‌న ఎప్పుడూ కొన‌సాగిస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం క‌దా.. అని ఆయ‌న వెన‌క్కి త‌గ్గింది లేదు. అధికారంలో ఉన్నాం క‌దా.. అని స‌రిపెట్టుకున్న‌దీ లేదు. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. మొహం మీదే అడిగేస్తారు. అలానే ఇప్పుడు.. అయ్య‌న్న పోలీసుల‌పై విరుచుకుప‌డ్డారు.

అయ్య‌న్న సొంత జిల్లా అన‌కాప‌ల్లి జిల్లా దొండ‌పూడిలో గ్రామ దేవత సంబ‌రాలు ఆదివారం ప్రారంభ‌మయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్స‌వాల‌ను.. స్పీక‌ర్‌ అయ్య‌న్న ప్రారంభించేందుకు వ‌చ్చారు. అయితే.. ఆయ‌న‌ను చూడ‌గానే పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గుమిగూడారు. అయితే.. వీరంతా అభిమానులే అయినా.. ప్ర‌స్తుతం రాజ‌కీయ ప‌రిస్థితి స‌రిగా లేక‌పోవ‌డంతో వీరిలో ఎవ‌రైనా వైసీపీ సానుభూతి ప‌రులు కూడా ఉంటే.. త‌న‌పై దాడి జ‌రిగితే ఏంటి? అనేది అయ్య‌న్న ఆవేద‌న. దీంతో పోలీసుల‌పై విమ‌ర్శ‌లు చేశారు.

దీనికి మ‌రో కార‌ణం కూడా.. ప్రొటోకాల్ ప్ర‌కారం స్పీక‌ర్‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలి. ఈ విష‌యంలో పోలీసులు స‌రిగా ప‌ట్టించుకోలేదు. స‌మ‌యానికి రావాల్సిన సీఐ, ఎస్సై వంటివారు అయ్య‌న్న‌కు క‌నిపించ‌లేదు. క‌నీసం.. త‌న‌కు భ‌ద్ర‌త‌గా మ‌రొక‌రు ఎవ‌రూ కూడా లేకుండా పోయారు. మ‌రోవైపు సాధార‌ణ ప్ర‌జ‌లు త‌న‌ను చుట్టుముట్టారు. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన అయ్య‌న్న‌.. పోలీసులపై విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌నీసం ప్రొటోకాల్ కూడా తెలియ‌క‌పోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? అని నిల‌దీశారు.

ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌కు దారితీసింది. పోలీసుల‌ను తిట్టారంటూ.. అయ్య‌న్న‌పై వైసీపీ నాయ‌కులు యాగీ చేయ‌డం ప్రారంభించారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన సీఎంవో అధికారులు, డీజీపీ కూడా.. అస‌లు ఏం జ‌రిగిందో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డీఎస్పీని ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించ‌క పోవ‌డానికి కార‌ణాలు చెప్పాల‌ని పేర్కొన్నారు. ఇదేస‌మ‌యంలో అయ్య‌న్న పాత్రుడికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని.. డీజీపీ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ.. అప్ప‌టికే వివాదం జ‌ర‌గ‌డంతో అయ్య‌న్న అన్య‌మ‌న‌స్కంగా నే కార్య‌క్ర‌మాన్ని ముగించి తిరిగి వెళ్లిపోయారు. అసెంబ్లీలోనే ప్ర‌శ్నిస్తాన‌ని ఆయ‌న పోలీసుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.