తెలుగు రాజకీయాల్లో పాత తరానికి కొత్త తరానికి మధ్య సంధిదశ అధినేతగా ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడ్ని చెప్పాలి. ఆయనలో సంప్రదాయ రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలతో పాటు కొత్త తరం నేతలకు ఉండే లక్షణాలు కనిపిస్తాయి. పాలన విషయంలో కొత్త తరహాలో ఆలోచించే ఆయన కట్టు తప్పే పార్టీ నేతలపై చర్యల విషయంలో మాత్రం పాతతరం అధినేతగా వ్యవహరిస్తూ ఉంటారు. క్రమశిక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు కట్టుదాటిన నేతలపై చర్యల విషయంలో ఓపెన్‌గా స్పందిస్తారే కానీ తనకు పట్టనట్లుగా అస్సలు వ్యవహరించరు.
మాటల్లో అదిరే కాఠిన్యాన్ని ప్రదర్శించే చంద్రబాబు చేతల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. పార్టీ నేతలకు సంబంధించి ఇటీవల కాలంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్న వేళ ఆయన అలాంటి నేతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని ఇప్పటికే పలుమార్లు చెప్పటం తెలిసిందే. తరచూ చర్యలు ఉంటాయన్న వార్నింగ్ తప్పించి చేతల్లో చూపించకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘చంద్రబాబుకో దండం. ఎప్పుడూ తీసుకునే చర్యల గురించి చెప్పటం కాదు చేతల్లో చూపిస్తే మంచిది’ అంటూ ఒక సీనియర్ నేత కుండబద్ధలు కొట్టగా పలువురు ప్రజాప్రతినిధులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.
తాజాగా కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలకు సంబంధించి చంద్రబాబు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు క్రమశిక్షణ తెలుసని దీంతో వారు పద్దతిగా నడుచుకుంటున్నారని కానీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి ముఖాముఖి మాట్లాడినట్లుగా చెప్పారు.
వారితో తాను వ్యవహరించే విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఆయన కొత్త మాటను చెప్పుకొచ్చారు. ‘‘గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు ఒకసారి పిలిచి పద్దతి మార్చుకోవాలని చెబుతా. తీరు మారకపోతే రెండోసారీ పిలిచి చెబుతా. అప్పటికీ మారకపోతే మూడోసారి చెప్పటం ఉండదు. కఠినంగా వ్యవహరిస్తా. అసలు రెండోసారి పిలవాలా? వద్దా? అన్నది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ తరహా వార్నింగ్‌లు చంద్రబాబు తరచూ చెబుతుంటారే తప్పించి ఆచరణలో చేసి చూపించింది లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కట్టుదాటి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న ఎమ్మెల్యేలను ఎందుకు ఉపేక్షించాలని ప్రశ్నిస్తున్నారు. తప్పులు చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని అప్పుడే మిగిలిన వారికి భయం భక్తి వస్తాయని అందుకు భిన్నంగా ఎప్పుడూ మాటలకే పరిమితం కావటం తాటాకు చప్పుళ్ల మాదిరే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మాటలు వదిలి చేతల్లో చూపించే దిశగా చంద్రబాబు వ్యవహరించాలని కోరుతున్నోళ్ల పెరుగుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates