రాజకీయాల్లో ఉన్న వారు తామున్న పరిస్థితిని మరిచిపోయి ఎదుటివారి పరిస్థితిని ఎద్దేవా చేయడం కామనే. తమ వరకు వస్తే అప్పుడు మాత్రం కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారంలో తాము ఎన్డీయేకు మద్దతు ఇస్తామని వైసీపీ ప్రకటించింది. ఇది తప్పుకాకపోవచ్చు. తమ పార్టీ తీసుకునే నిర్ణయం కావొచ్చు.
కానీ ఈ సమయంలో గతం గుర్తు చేస్తున్నారు మేధావులు. కేంద్రంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇచ్చే సమయంలో మన రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అదే మేమైతే మాకు ఒక్క అవకాశం వస్తే కేంద్రాన్ని నిలేసి రాష్ట్రానికి మేళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా పోలవరం నిధులు ఇస్తే తప్ప మేం మద్దతు ఇవ్వబోం అని గత ఆరేడేళ్లుగా జగన్ పాడిందే పాట పాడుతున్నారు. అంతేకాదు గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా ఈమాటే చెప్పారు.
జనసేన, బీజేపీ, టీడీపీ కలయికను తప్పుబట్టిన జగన్ రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు తీసుకువస్తున్నారో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. కట్ చేస్తే ఏడాదిన్నర తిరగకుండానే ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఎన్డీయే ఏకగ్రీవంగా నిలబెట్టిన సీపీ రాధాకృష్ణన్‌కు వైసీపీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. తమకు రాజ్యసభలో ఉన్న 9 మంది, లోక్‌సభలో ఉన్న ముగ్గురు కూడా రాధాకృష్ణన్‌కే ఓటేస్తారని తేల్చిచెప్పింది.
మరి ఇప్పుడు జగన్ ఏం డిమాండ్ చేసి ఈ మద్దతు ప్రకటించారన్నది ప్రశ్న. ఆయన గతం నుంచి గగ్గోలు పెడుతున్నట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ప్రకటించామని చెప్పగలరా? ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని బలపరుస్తున్నామని అనగలరా? లేక సొంత జిల్లా కడపలో విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన ఉక్కు పరిశ్రమ కోసం ఎన్డీయే వెనక ఉన్నామని అనగలరా?
అంటే ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి. తన వరకు వస్తే ఎలాగైనా రాజకీయాలు చేయొచ్చు కానీ ఎదుటి వారి విషయంలో మాత్రం ఎలాగైనా విమర్శలు చేయొచ్చన్న వాదన జగన్ నుంచే నేర్చుకోవాలేమో అంటున్నారు మేధావులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates