రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని మరో 20 ఏళ్లపాటు కొనసాగించాలన్నది సీఎం చంద్రబాబు వ్యూహం. ప్రస్తుతం జరుగుతున్న పాలన కాకుండా మరో 20 ఏళ్లపాటు ఇలానే ఒకే ప్రభుత్వం ఏర్పడేలా, ప్రజలు కూడా ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకునేలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట కూడా ఇదే. అయితే పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్లు అంటున్నారు. సో ఎలా చూసుకున్నా ఇద్దరు నాయకులు కూడా మరో 20 ఏళ్లపాటు అధికారంలో ఉండాలనే కోరుకుంటున్నారు.
అయితే ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఆశలు ఉండొచ్చు, ప్రభుత్వాలకు కూడా కోరికలు ఉండొచ్చు. కానీ సాధ్యమవుతాయా అనేది ప్రశ్న. ప్రతి ఐదేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారు. వైనాట్-175 అని ఆశలు పెట్టుకున్న జగన్‌ను కూడా ప్రజలు 11కు పరిమితం చేశారు. ఇంకేముంది గెలుపు మాదే అని భుజాలు చరుచుకున్న వారిని కూడా ఓడించి పక్కన పెట్టారు.
ఇవన్నీ చంద్రబాబుకు తెలియంది కాదు. ప్రజల నాడిని ఆయన కొత్తగా పట్టుకోనూ లేదు. ఈ నేపథ్యంలోనే రెండు రకాల వ్యూహాలతో రాష్ట్రంలో మళ్లీమళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడేలా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
దీనిలో భాగంగా గత ఎన్నికలకుముందు ఎలాంటి స్ట్రాటజీ పాటించారో ఇప్పటి నుంచే ఆ తరహా స్ట్రాటజీని పాటించాలని నిర్ణయించారు.
- రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని విదేశాల్లో ఉన్న, ఉంటున్న వారితో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయించాలని నిర్ణయించారు. సాధారణంగా మన వాళ్లు చెబితే నచ్చని విషయం, ఎవరో పొరుగు వారు వచ్చి చెబితే అర్థమవుతుంది. ఇప్పుడు దానినే చంద్రబాబు పాటించాలని నిర్ణయించారు. ఎన్నారైలు, ఇతర ప్రముఖులతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడులపై ఆయన ప్రచారం చేయిస్తారు. తద్వారా గ్రాఫ్ తగ్గకుండా చూసుకుంటారు.
ఇక పీ-4 ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతారు. పేదరికంపై పోరులో భాగంగా ఉన్నతవర్గాలకు ప్రజలను దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు. దీనికి సంబంధించిన స్పందనతో పనిలేకుండా ప్రజల నుంచి వస్తున్న రియాక్షన్‌ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తద్వారా ప్రజల్లో నిరంతరం చర్చ జరిగేలా, ప్రభుత్వానికి వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates