‘అయ్యా.. అక్షరం ముక్కరాదు.. అక్రమం చేస్తానా?’

ఇదేదో సినిమా డైలాగు కాదు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి, ఎస్సీ నాయకుడు, సీనియర్ నేత కిళత్తూరు నారాయణ స్వామి చెప్పిన మాట. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు 48 మందిపై కేసు నమోదు చేశారు. 13 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఈ పరంపరలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామి పాత్ర కూడా ఈ కుంభకోణంలో ఉంటుందని అధికారులు సందేహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయనకు కూడా గత నెలలో నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. తాజాగా శుక్రవారం ఉదయం సిట్ అధికారులు ముగ్గురు నేరుగా చిత్తూరులోని ఆయన ఇంటికే వెళ్లారు. పలు పత్రాల కోసం ఆయన ఇంట్లో తనిఖీ చేశారు. తనిఖీకి మాజీ మంత్రి సంపూర్ణంగా సహకరించినట్టు తెలిసింది.

రండి సర్, రండి అంటూ ఎలాంటి బెరుకూ లేకుండా అధికారులను పిలిచి టీ, కాఫీలు బయట నుంచి తెప్పించి మర్యాదలు చేశారు. అనంతరం ఆయనే స్వయంగా బెడ్ రూం సహా బీరువాల తాళాలు ఇచ్చి దగ్గరుండి వారు తనిఖీలు చేసుకునేందుకు సహకరించారు.

అయితే తమకు కావాల్సిన పత్రాలు లభించకపోవడంతో మరోసారి నారాయణ స్వామికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈసారి తప్పక విచారణకు వస్తానని ఆయన చెప్పడంతో వెనుదిరిగారు.

తనిఖీలు చేస్తున్న సమయంలో నారాయణ స్వామి బేల పలుకులు పలికినట్టు తెలిసింది.

అయ్యా, నాకు అక్షరం ముక్కరాదు. అంతా మా సారే చూసుకున్నారు. ఆయనే నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన ఏం చెబితే అది చేశా. అది అక్రమమో సక్రమమో నాకు తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారు, మీకెలా సహకరిస్తున్నానో అప్పట్లో ప్రభుత్వంలో మంత్రిగా మా బాస్ చెప్పినట్టు చేశా. మీరు రమ్మంటున్నారు కాబట్టి మళ్లీ సారి విచారణకు వస్తా అని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.