అలా జరిగి ఉంటే సుదర్శన్ రెడ్డికి మద్దతిచ్చేవాళ్లం: చంద్రబాబు

ఎన్డీయే మిత్రపక్షాలుగా ఉన్నాం. మా దంతా ఒకే మాట. ఈ విషయంలో రెండో ఆలోచన మాకు లేదు అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే మిత్రపక్షాలు ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు తెలిపారు. టీడీపీ ఎంపీలు, మంత్రులతో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు రాధాకృష్ణన్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు “మీ గెలుపు తథ్యం” అంటూ భరోసా ఇచ్చారు.

అనంతరం జాతీయ మీడియా చంద్రబాబును పలకరించింది. మీరు ఎవరికీ మద్దతు ఇస్తున్నారు అని ప్రశ్నించగా, తాను ఎన్డీయే కూటమిలో ఉన్నానని, కాబట్టి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌కే మద్దతు ఇస్తామని చెప్పారు.

తెలుగు వారైన బీ. సుదర్శన్ రెడ్డికి ఎందుకు ఇవ్వరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఎన్డీయే కూటమి ఆయన్ను ఎంపిక చేసి ఉంటే తప్పకుండా ఆయన్నికే మద్దతు ఇస్తామని చెప్పారు. కానీ, సీపీ రాధాకృష్ణన్ వంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజ్యాంగపరమైన పదవుల్లోనూ అనుభవం సంపాదించిన వ్యక్తికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.

సీపీ రాధాకృష్ణన్ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికి ఆయన గౌరవం తీసుకొస్తారని చెప్పారు. ఎన్నికలకు ముందు నుంచే ఎన్డీయేలో తాము భాగస్వామ్యంగా ఉన్నామని, అందరూ కలసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ప్రధానమంత్రితో కూడిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ ముందుగానే తమతో చర్చించినట్టు చెప్పారు. ఈ సమయంలో అభ్యర్థి ఎవరో తమకు చెప్పకపోయినా, ఎవరిని ఎంపిక చేసినా మద్దతిస్తామని ముందుగానే హామీ ఇచ్చామని, అందుకే సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తున్నామన్నారు. గెలిచే అవకాశం లేకపోయినా ఇండియా కూటమి రాజకీయమే చేస్తోందని విమర్శించారు.

ఆ విషయం జగన్‌ను అడగండి!

వైసీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇస్తోందని, దీనిని ఎలా చూస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు విస్తృతంగా సమాధానం చెప్పకుండా, ఆ విషయాన్ని జగన్‌నే అడగాలని, దీనిలో తాము జోక్యం చేసుకునేది లేదని చెప్పారు. ఎవరి ఇష్టం వారిదని, ఎన్డీయే మిత్రపక్షాలుగా మాత్రమే తాము మాట్లాడగలమని తెలిపారు.

వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీనికి ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా లేకపోయినా, వైసీపీ మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేయడంతో జగన్ మద్దతు తెలిపారు. దీనిని వైసీపీ సమర్థించుకుంది. కాంగ్రెస్‌కు తమకు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉందని, అలాంటప్పుడు ఆ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి మద్దతు ఎలా తెలుపుతామంటూ వైసీపీ ప్రశ్నించింది.