టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. అంత సుదీర్ఘంగా జరగడానికి పెద్దగా అజెండా ఏమీ లేదు గానీ, నిర్దేశిత అజెండా పూర్తి కాగానే కట్టు దాటుతున్న ఎమ్మెల్యేలు, ప్రత్యేకించి టీడీపీ ఎమ్మెల్యే తీరుపై కీలక చర్చ జరిగింది. అంతేకాకుండా మంత్రుల పనితీరునూ ప్రస్తావించిన బాబు, ఇప్పటి నుంచి అయినా కాస్తంత పనితీరు మెరుగుపరచుకోండి అంటూ క్లాస్ పీకారు. మొత్తంగా కట్టు దాటిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులనూ బాబు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేశారని చెప్పక తప్పదు.
కేబినెట్ ఎజెండా ముగియగానే ఇటీవల వరుసగా టీడీపీకి చెందిన సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలపై వెల్లువెత్తిన వివాదాలను బాబు ప్రస్తావించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ మనమే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నామన్న విషయం వారికి తెలియదా? అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని భావన ఉన్న వారు ఇప్పటి నుంచి ఆ భావన నుంచి బయటకు రావాలని, లేనిపక్షంలో కఠిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న విషయాన్నే చూడబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ప్రతి ఎమ్మెల్యే తమ తమ కట్టుబాట్లలో ఉండి తీరక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఆపై మంత్రుల పనితీరుపై ప్రస్తావించిన బాబు, మంత్రులు తమ వద్దకు వస్తున్న ఫైళ్లను క్లియర్ చేయడంలో తీవ్ర అలసత్వం చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో రీతిన వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. తన టేబుల్ పైకి వచ్చిన ఫైళ్లను సకాలంలో క్లియర్ చేయడానికి మంత్రులు వచ్చిన ఇబ్బందేమిటని ఆయన ప్రశ్నించారు. ఏ మంత్రి ఎంత కాలంలో ఓ ఫైల్‌ను క్లియర్ చేస్తున్నారన్న వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని బాబు సంచలన వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య విన్నంతనే మంత్రులు షాక్‌కు గురయ్యారు. ఇకనైనా కాస్తంత పనిపై, ఫైళ్ల క్లియరెన్స్‌పై దృష్టి సారించాలని ఆయన సూచించారు. అలా కాని పక్షంలో ఎవరికి తగ్గ ఫలితం వారికి దక్కుతుందని కూడా బాబు పరోక్షంగా మంత్రులను హెచ్చరించారు.
వాస్తవానికి కేబినెట్ సమావేశాల్లో రాజకీయ అంశాలను చంద్రబాబు పెద్దగా ప్రస్తావించరు. అయితే ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు, వారంతా టీడీపీకి చెందిన వారే కావడం, వారంతా కట్టు దాటి వ్యవహరించిన నేపథ్యంలో ఈ విషయాన్ని బాబు కేబినెట్ భేటీలో ప్రస్తావించారన్న వాదన వినిపిస్తోంది. కూటమిలోని ఇతర రెండు పార్టీలకు చెందిన ఒకరు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పలుమార్లు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. వారి వ్యవహారాన్ని బాబు ఎంతమాత్రం ప్రస్తావించకుండానే సాగడం గమనార్హం. ఈ క్రమంలో ఆయా పార్టీ అధినేతలు తమ సభ్యులను అదుపులో పెట్టుకునే అవకాశం ఇచ్చినట్టైందన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates