తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం ఆ రాష్ట్రంలో ఏ మేర ప్రకంపనలు సృష్టించనుందన్న దానిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రెండేళ్ల క్రితం రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్.. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చాక సినిమాలు చేయనని సంచలన ప్రకటన చేశారు. తాజాగా గురువారం తమిళనాడులోని మధురైలో జరిగిన టీవీకే ద్వితీయ వార్షికోత్సవ సభలో ఆయన తన రాజకీయ ప్రస్థానంపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. తమ పార్టీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోదని ప్రకటించిన విజయ్… ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే విజయ్ రాజకీయాల్లోకి దూకేశారు. ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చి హడావిడితో బొక్కబోర్లా పడటం ఎందుకన్న భావనతోనే విజయ్… దాదాపుగా ఎన్నికలకు రెండున్నరేళ్లకు పైగా సమయం ఉండగానే… రాజకీయ పార్టీని ప్రకటించారు. అంతేకాకుండా ఈ రెండేళ్లలోనే పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన విజయ్.. పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా నేతల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ కారణంగానే మధురై టీవీకే సభకు అశేష జనవాహిని తరలివచ్చింది.
ఈ సందర్భంగా ఒకింత ఉద్వేగంగా మాట్లాడిన విజయ్… వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీతోనూ టీవీకే పొత్తు పెట్టుకోదని ప్రకటించారు. ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. అంతటితో ఆగని విజయ్… వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ప్రకటించిన ఆయన…. ఆ రెండు పార్టీల్లో ఒకటి టీవీకే అయితే రెండోది ప్రస్తుతం అదికారంలో ఉన్న డీఎంకే అని చెప్పుకొచ్చారు. మొత్తంగా అన్నాడీఎంకేను అసలు లెక్కలోకే తీసుకోని విజయ్… డీఎంకేతోనే తన పోటీ అంటూ ప్రకటించిన తీరు చూస్తుంటే…రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates