సీఎం చంద్రబాబుకు తమ్ముళ్ల వ్యవహారం చెవిలో జోరీగలా మారుతోంది. “జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దు. పార్టీ పరువు తీయొద్దు. మీరు జాగ్రత్తగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటా” అని టీడీపీ అధినేతగా పార్టీ ఎమ్మెల్యేలలో దారి తప్పిన కొందరిని చంద్రబాబు హెచ్చరించారు.
అయితే ఆయన అలా హెచ్చరించి 24 గంటలు కూడా గడవకముందే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వ్యవహారం పెను దుమారం రేపింది. అటవీ శాఖ ఉద్యోగులను ఆయన చితక్కొట్టిన ఘటన వెలుగుచూసింది.
దీంతో చంద్రబాబు మరింత ఆగ్రహానికి గురయ్యారు. పైగా అటవీ శాఖ పవన్ కళ్యాణ్ చేతిలో ఉండడం, ఆయనకు కూడా ఈ వ్యవహారం మచ్చతెచ్చేలా ఉండటంతో పాటు రాజకీయంగా వైసీపీకి అవకాశం ఇచ్చినట్టయింది. దీంతో హుటాహుటిన స్పందించిన చంద్రబాబు బుడ్డాపై చర్యలకు ఆదేశించారు. కేసు పెట్టాలని కూడా పోలీసులను ఆదేశించారు.
అయితే ఈ పరిణామం కేవలం బుడ్డాకే కాదు, అనేక మంది నాయకులకు కూడా వర్తిస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే బాధ్యత కూడా చంద్రబాబుపైనే పడింది. నాయకులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే వైసీపీపై విరుచుకుపడుతున్నారు. మిగిలిన వారు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ఈ పరిణామాలతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు పదేపదే సమీక్షలు చేస్తున్నారు. ఇక అమరావతి పనులు, మరో ఎత్తు, ఇవన్నీ ఇలా ఉండగా ఎమ్మెల్యేలు సహకరించాల్సిందిపోయి ఎక్కడికక్కడ వివాదాలు తీసుకురావడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారం కూడా పార్టీలో వివాదానికి దారితీసింది. ఆయన కేవలం జూనియర్ ఎన్టీఆర్‌ను విమర్శించడమే కాకుండా స్థానికంగా టీడీపీ నాయకులతోనూ కలివిడిగా లేకపోవడం, వసూళ్ల కార్యక్రమం వంటి అంశాలపై మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై వెంటనే అమరావతికి వచ్చిన దగ్గుపాటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ చంద్రబాబు ఆయనను తిట్టిపోశారు.
ఇలా మొత్తంగా తమ్ముళ్లు మారకపోగా రోజు రోజుకు వివాదాలు కొని తెచ్చుకోవడం బాబుకు తలనొప్పిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి తమ్ముళ్లు మారుతారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates