బాబును ప్రశాంతంగా ఉండనివ్వరా…?

అరె… అసలే ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన నవ్యాంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేందుకు టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అహరహం శ్రమిస్తున్నారు. ఇక రాజధాని లేదన్న రాష్ట్రంగా ఏపీ ఇకపై పిలబడకుండా ఉండేలా…ఈ ఐదేళ్లలోనే రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు మరోవైపు కసరత్తు చేస్తున్నారు. అంతేనా.. ఏపీలో కూటమి రథసాథిగా ఉన్న బాబు…మూడు పార్టీల మధ్య ఎక్కడ కూడా సమన్వయం కొరవడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్నందున… ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా ఢిల్లీ వెళ్లక తప్పడం లేదు. ఇలాంటి సమయంలో టీడీపీకి చెందిన ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో వివాదంతో నిత్యం పతాక శీర్షికలకు ఎక్కుతున్నారు. బాబుకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు.

గతంలో టీడీపీ నేతల వివాదాలను వదిలేస్తే… ఇటీవలే ఏకంగా ఐదు వివాదాలు రేగాయి. వీటిలో ఏకంగా ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు సీనియర్ మోస్ట్ నేత కాగా… ఇద్దరు సీనియర్ నేతలు, మరో ముగ్గురు కొత్తవారే అయినప్పటికీ పెను వివాదాలనే రేపి బాబుకు తలపోటు తెప్పించేశారు. మొన్నటికి మొన్న మహిళతో వివాహేత బంధం బయటపడిందని బాధిత మహిళనే బెదిరించిన కేసులో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే నసీర్ ఇరుక్కున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను బూతులతో దూషించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. ఇక మహిళా ఉద్యోగిని రాత్రివేళ వీడియో కాల్ చేయాలంటూ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పిన వీడియో పెను దుమారమే రేపింది.

ఇక రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్, ఆసుపత్రిలోనే అతడి రాసలీలల వ్యవహారం నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత, మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ లు ఇరుక్కున్నారు. వీరిలో తన తప్పేమీ లేదని వెనువెంటనే వివరణ ఇచ్చేసి సోమిరెడ్డి తప్పుకుంటే… సునీల్ మాత్రం అడ్డంగా బుక్కైపోయారు. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం కూడా బాబుకు తలపోటు వ్యవహారంగానే మారిందని చెప్పక తప్పదు. ఎందుకంటే…ఈ వివాదంలో సాక్షాత్తు హోం మంత్రి వంగలపూడి అనిత పేరు కూడా వినిపించడం, శ్రీకాంత్ కు పెరోల్ ఇవ్వాలంటూ స్వయంగా టీడీపీ నేతలే లేఖలు రాయడం నిజంగా తలపోటే కదా. వీటన్నింటినీ ఎలాగోలా సర్దేసిన బాబు ఒకింత ఊరట తీసుకుందామంటే.. నంద్యాల జిల్లా శ్రీశైలంలో స్థానిక ఎమ్మెల్యే పెను వివాదానికే కారణమయ్యారు.

శ్రీశైలం నియోజకవర్గం నుంచి బుడ్డా రాజశేఖరరెడ్డి కొనసాగుతున్నారు. పార్టీలో ఈయన సీనియర్ నేత కిందే లెక్క. మొన్నటిదాకా పెద్దగా వివాదాల జోలికి వెళ్లని బుడ్డా… తాజాగా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న తన అనుమతి లేకుండా తన నియోజకవర్గంలోకి వచ్చారంటూ టీడీపీ ఎంపీ శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డిలపై తన అనుచరులతో దాడి చేయించిన ఆయన సంచలనం రేపారు. తాజాగా మంగళవారం అర్థరాత్రి దాటాక ఏకంగా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో అటవీ శాఖ సిబ్బందిపై చేయి చేసుకున్న బుడ్డా.. పెను వివాదంలో చిక్కుకున్నారు. కారు అపినా ఆపకుండా వెళ్లిన బుడ్డా… తాను తప్పు చేసి తనను వెంబడిస్తారా? అంటూ అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం గమనార్హం.

వాస్తవానికి అటవీ శాఖ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని శాఖ. తన శాఖ సిబ్బందిపై అది కూడా దళిత వర్గానికి చెందిన అధికారులపై దాడి చేస్తారా? అని పవన్ కల్యాణ్ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇస్తే… పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరహా ముప్పును ముందుగానే గ్రహించిన బాబు… ఈ ఘటనపై బుడ్డాకు ఫుల్ క్లాస్ పీకారట. అదే సమయంలో అసలు జరిగిన సంగతేమిటో అధికారులతో ఆరా తీసిన బాబు… ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అటవీ శాఖ ఉద్యోగులు బహిరంగంగా వచ్చి… బుడ్డాపై కేసు నమోదు చేయాలన్న డిమాండ్ మేరకు తన పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ బుడ్డాపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. బాబు ఆదేశంతో బుడ్డాపై కేసు అయితే నమోదు అయిపోయింది.