కేంద్రంలో చ‌క్రం.. ఇక‌, చిన్న‌బాబుదేనా ..!

టిడిపి యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కేంద్రంలో పూర్తిస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ సీనియర్ నాయకులు సహా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు టిడిపి అధినేత చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతూ వచ్చారు. ఎన్ డి ఏ మిత్ర ప‌క్షాల‌తో కలిసి ఆయన రాజకీయాలు చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఇకనుంచి నారా లోకేష్ పాత్ర పెరిగే అవకాశం ఉందని పార్టీలో ఏ ఇద్దరు నాయకులు కలిసినా చర్చించుకుంటున్నారు.

సాధారణంగా చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ నారా లోకేష్ కు వస్తుందా అంటే ప్రస్తుత పరిణామాలను గమనిస్తే వస్తుందని సమాధానం వినిపిస్తోంది. 2014-19 మధ్య నారా లోకేష్ మంత్రిగా ఉన్నప్పటికీ కేంద్రంలో రాజకీయాలను మాత్రం చంద్రబాబు పూర్తిస్థాయిలో నడిపించారు. అప్పట్లో ఢిల్లీకి చంద్రబాబు మాత్రమే వెళ్లి రాజకీయాలను, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇతరత్రా అంశాలను పరిశీలించేవారు. కానీ, గత ఏడాది ఏర్పడిన కూటమి ప్రభుత్వం తర్వాత కేంద్రంలో నారా లోకేష్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది.

తరచుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్రంలోని మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడుతున్నారు. అదేవిధంగా గత కొంతకాలంగా ఎన్డీఏ మిత్ర పక్షాలతో కూడా ఆయన భేటీ నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ముందు ముందు లోకేష్ పాత్ర మరింత పెరిగే అవకాశం ఉందన్నది ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు టిడిపి నాయకులలోను జరుగుతున్న చర్చ. తాజా పర్యటనలో కూడా కేంద్ర మంత్రులతో పాటు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ అయిన సిపి రాధాకృష్ణన్ ను కూడా నారా లోకేష్ కలుసుకున్నారు. ఆయన అభినందించారు.

కూట‌మి తరఫున బలమైన వ్యక్తిగా కూడా పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఎన్డీఏ ఇతర పక్షాలతో కూడా నారా లోకేష్ భేటీకి సిద్ధమయ్యారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు భవిష్యత్తులో మంత్రి నారా లోకేష్ పూర్తి స్థాయిలో కేంద్రంలో చక్రం తిప్పే నాయకుడిగా మారబోతున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దాదాపుగా నారా లోకేష్ కేంద్రం స్థాయిలో కూడా రాజకీయాలు చేసే దిశగా అడుగులు వేస్తారని అంటున్నారు. మిత్రపక్షాల నాయకులను సమన్వయం చేయడంతో పాటు టిడిపి ప్రాధాన్యాలను మరింత పెంచే దిశగా కూడా నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు.

పార్టీ పార్లమెంటరీ సభ్యులతో పాటు జనసేన ఎంపీలను కూడా కలుపుకొని ఆయన నిర్వహిస్తున్న సమావేశాలు, ఎన్డీఏ మిత్రపక్షాల కీలక నేతలతో జరుగుతున్న చర్చలు వంటివి భవిష్యత్తులో నారా లోకేష్ కేంద్ర స్థాయిలో వ్యవహరించే రాజకీయాలకు అద్దంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో నారా లోకేష్ పుంజుకునే విషయంపై సర్వత్రా చర్చ జరుగుతూ ఉండడం విశేషం.