రాజకీయాల్లో రాకముందు.. వ్యక్తులు ఎలా ఉన్నా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం వ్యక్తుల యాట్టి ట్యూడ్ మారుతుంది. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ రాజకీయాల్లోకి వచ్చి.. విజయం దక్కించుకున్న నాయకుల తీరు ఇలానే ఉంది. అంతా తమకే తెలుసునని.. ఎవరూ తమకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. చెప్పే తొలిసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. అంతర్గతంగా ఇలాంటి వారితోనే పార్టీలకు, ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అయితే.. ఇలాంటి వారికి భిన్నంగా ఓ ఎంపీ మంచి మార్కులు వేయించుకుంటున్నారు.
అంతేకాదు.. ఎవరు ఏం చెప్పినా.. సావధానంగా ఉంటున్నారు. వారు చెప్పింది.. ఆమూలాగ్రం వింటున్నారు. తప్పకుండా.. చేస్తానని హామీ కూడా ఇస్తున్నారు దీంతో సదరు ఫస్ట్ టైమ్ ఎంపికి మంచి మార్కులు పడుతున్నాయి. ఆయనే కాకినాడ ఎంపీ.. జనసేన యువనాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. వినయం, విధేయతలకు ఆయన పెట్టింది పేరుగా కూటమిలో చర్చ సాగుతోంది. నిజానికి పలువురు నాయకులపై విమర్శలు వస్తుంటే.. తంగెళ్లపై మాత్రం .. ఇలాంటి ఆరోపణలు లేవు.
పైగా.. ఆయన ‘అందరివాడు’ అంటూ.. టీడీపీకి చెందిన సీనియర్ నేత, కాకినాడ మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి ప్రధాన కారణం.. ఎవరి విషయంలోనూ.. తంగెళ్ల జోక్యం లేదు. ఆయన చేయాలని అనుకున్నది కూడా.. స్థానిక ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. అంతేకాదు.. పార్లమెంటు సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి.. వారి వారి నియోజకవర్గాల్లో కేంద్రం స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలపై అడిగి తెలుసుకుని నోట్స్ తయారు చేసుకుంటున్నారు.
అంతేకాదు.. వాటిపై నిబద్ధతతో అధ్యయనం చేస్తున్నారు. పార్లమెంటులోనూ ప్రశ్నిస్తున్నారు. కాకినాడకు ఏది అవసరమో గుర్తించేందుకు ఆయన కలెక్టర్‌తోనూ సమన్వయం చేసుకుంటున్నారు. ఆరోపణలకు, ప్రత్యారోపణలకు కూడా ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. మరో మాట చెప్పాలంటే.. ప్రతిపక్ష వైసీపీ నాయకులు సైతం ఆయనను విమర్శించలేని పరిస్థితిలో ఆయన పనితీరు ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది. సో.. ఇలా నియోజకవర్గం సమస్యలపై అధ్యయనం చేయడంతోపాటు.. వాటిని పరిష్కరించేందుకు, అందరినీకలుపుకొని పోయేందుకు ఎంపీ తంగెళ్ల ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates