యాంటీ ప్ర‌చారం 4 ర‌కాలు: చంద్ర‌బాబు ప‌రిష్కారాలు

యాంటీ ప్ర‌చారం.. అధికారంలో ఉన్న పార్టీల‌కు అస్స‌లు న‌చ్చ‌నిది. గిట్టనిది కూడా. తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు న‌మ్ముకున్న ఈ ప్ర‌చారమే.. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇబ్బంది పెడుతుంది. ఏపీలోనూ ఇప్పుడు అదే జ‌రుగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వంపై యాంటీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌రూపంలో కాదు.. నాలుగు విధాలుగా ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ విష‌యం ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. తాజాగా ఆదివారం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారుపై జ‌రుగుతున్న యాంటీ ప్ర‌చారాన్ని ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఒక విధంగా కాదు.. నాలుగు విధాలుగా ఈ యాంటీ ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. మీరు ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వ్య‌క్తిగ‌తంగా నాయ‌కుల‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేక‌పోతే.. వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చి.. వివ‌ర‌ణ ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఒక వేళ నిజ‌మే అయితే.. పద్ధ‌తి మార్చుకోవాల‌ని సునిశితంగా నాయ‌కుల‌ను సీఎం చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

ఇక‌, చంద్ర‌బాబు చెప్పిన నాలుగు విధాలు చూస్తే..

1) ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేస్తున్నారు: వాస్త‌వానికి ఈ వ్య‌తిరేక ప్ర‌చారం వైసీపీ చేస్తోంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు సేక‌రించిన స‌మాచారం మేర‌కు.. సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా ఈ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని నిలువ‌రించేందుకు నాయ‌కులు అంతే యాక్టివ్ కావాల‌ని ఆయ‌న చెప్ప‌కొచ్చారు. అంతేకాదు.. ప్ర‌తి ఎమ్మెల్యే సోషల్ మీడియా లో అకౌంట్లు పెట్టుకోవాల‌ని కూడా సూచించారు.

2) వ్య‌క్తిగ‌త ప్ర‌చారం: ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై కూడా.. వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని నిలువ‌రించేందుకు వారే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. సూచించారు.

3) కూట‌మిపై వ్య‌తిరేక ప్ర‌చారం: ఈ విష‌యాన్ని కూడా సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. కూట‌మిలో అనైక్య‌త ఉంద‌ని.. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చే నాలుగేళ్లు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. క‌ల‌సి క‌ట్టుగా అంద‌రితోనూ క‌లివిడిగా ఉండ‌డంతోనే ఈ ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌న్నారు.

4) కేంద్ర స‌హ‌కారం: కేంద్రంలోని బీజేపీ కి మ‌ద్దుతుగా ఉన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని కూడా తిప్పికొట్టాల‌ని బాబు సూచించారు. అమ‌రావ‌తి, పోల‌వ‌రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, సెమీకండెక్ట‌ర్ ప్రాజెక్టు, ఇత‌రత్రా స‌హ‌కారంపై చ‌ర్చించాల‌ని కూడా ఆయ‌న సూచించారు. మ‌రి త‌మ్ముళ్లు క‌దులుతారో లేదో చూడాలి.