దేశ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. ఓట్ల చోరీ ఆరోపణలతో విపక్షాలు తీవ్రంగా మండిపడుతుండగా, ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావాలన్న యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, సయ్యద్ నసీర్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ, అవసరమైతే అభిశంసనను కూడా తీసుకొస్తామని సంకేతాలు ఇచ్చారు.
అభిశంసన తీర్మానం అంటే ఏమిటీ?
ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని (ఉదా: ప్రధాన ఎన్నికల కమిషనర్, న్యాయమూర్తి, రాష్ట్రపతి) తన పదవీ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదని గాని లేదా తప్పు చేశాడని ఆరోపణలతో పదవి నుంచి తొలగించమని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అధికారిక తీర్మానం. ఇది సాధారణంగా చాలా కఠినమైన ప్రక్రియ. రెండు సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) మూడింట రెండొంతుల మెజార్టీతో ఆమోదం పొందితేనే ఆ వ్యక్తిని పదవి నుంచి తప్పించవచ్చు. అంటే ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత తీవ్రమైన శిక్షా విధానం లాంటిది.
సీఈసీపై అభిశంసన అంటే అది సులభం కాదు. పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలకు ఆ సంఖ్య లేదు. అయినా, విపక్షాలు ఈ ప్రయత్నం ద్వారా ఒక రాజకీయ సందేశాన్ని పంపించాలనుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో జరిగిన అనుమానాస్పద సంఘటనలపై ప్రజల దృష్టిని మరల్చడమే ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.
ఇక మరోవైపు, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఆరోపణలు నిజమైతే ఆధారాలు సమర్పించాలి అని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సాక్ష్యాలను ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌ను లక్ష్యంగా చేసుకుని చేసే రాజకీయాలను ఇక సహించబోమని ఆయన ఘాటుగా పేర్కొన్నారు.
దీనిపై రాహుల్ గాంధీ కూడా వెనుకడుగు వేయలేదు. 2023లో ప్రభుత్వం చేసిన చట్టసవరణలను ప్రస్తావిస్తూ, ఎన్నికల కమిషనర్లపై కేసులు నమోదు కాకుండా ప్రత్యేక రక్షణ కల్పించారని ఆరోపించారు. ఇది మోదీ – షా లకు సహకరించే ప్రయత్నమేనని, ఓట్ల చోరీలో ఈసీ భాగస్వామ్యం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై ఆయన బిహార్‌లో యాత్ర కూడా మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూస్తే, రాబోయే రోజుల్లో సీఈసీపై ప్రతిపక్ష దాడులు మరింత ముదిరే అవకాశం ఉంది. అభిశంసన తీర్మానం ఆమోదం పొందకపోయినా, రాజకీయంగా అది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే దోహదపడుతుందనే కామెంట్స్ వస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates