ప్రస్తుతం ఏపీలో అధికార కూటమికి రథసారథిగానే కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు. ఓ వైపు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్న బాబు… కూటమిలోని మూడు పార్టీల మధ్య బంధం అంతకంతకూ బలపడేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఢిల్లీ వెళ్లాల్సి వస్తోంది. అలాంటి కీలక తరుణంలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం బాబుకు ఓ రేంజిలో కోపం తెప్పించారు. ఈ కోపం ఏ స్థాయికి వెళ్లిందంటే… ఢిల్లీ టూర్ కు సిద్దమవుతూ కూడా ఆ ముగ్గురి వ్యవహారంపై తక్షణమే తనకు నివేదికలు కావాలని బాబు కోరారు.
గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నసీర్ గడచిన నాలుగైదు రోజులుగా వార్తల్లోకి ఎక్కారు. ఓ మహిళతో వివాహేతర బంధం సాగించిన నసీర్…ఆ విషయాన్ని బయటపెట్టిందనే దుగ్ధతో ఆమెను చంపేస్తానంటూ బెదిరించాడట. ఈ బెదిరింపులపై బాధిత మహిళ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో నసీర్ తనను బెదిరిస్తున్న వీడియోలను కూడా ఆమె పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా నసీర్ బండారం బయటపడిపోయింది. ఈ విషయాన్ని ఎలా రాజీ చేసుకోవాలో కూడా తెలియని రీతిలో నసీర్ కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నసీర్ పై బాబుతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు టీడీపీ సీనియర్ నేత, గతంలో పార్టీ విప్ గా పనిచేసిన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఇదే తరహా వివాదంలో కూరుకుపోయారు. తన నియోజకవర్గ పరిధిలోని ఓ కేజీబీవీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సౌమ్యకు రాత్రి సమయంలో ఫోన్ చేసి తనకు వాట్సాప్ వీడియో కాల్ చేయాలని కోరారట. ఈ విషయాన్ని ఆమె ఆదివారం బయటపెట్టేసింది. తన మాదిరే రవి చేతిలో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడ్డారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆమెకు తెలియకుండానే ఆమెను ఆ పోస్టు నుంచి తప్పించి మరో మహిళను ప్రిన్సిపల్ గా కూర్చోబెట్టారట. ఈ వ్యవహారం రవిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
ఇక తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇదివరకే సొంత పార్టీ నేతలతో విభేదాలతో వివాదాల్లో చిక్కుకున్నారు. టీడీపీకే చెందిన ఓ ద్వితీయ శ్రేణి నేతను ఏకంగా చంపేస్తానంటూ ప్రసాద్ బెదిరించారన్న ఆరోపణలు ఆయనను చిక్కుల్లో పడేశాయి. ఆ తర్వాత అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితోనూ ప్రసాదం కయ్యం పెట్టుకున్నారు. వీరి వివాదం ఇప్పుడు రసకందాయంలో పడింది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం వార్ 2 సినిమాను ఆడనివ్వనని చెబుతూనే తారక్ ను బూతులతో తిట్టిన ఆయన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఆడియో తనది కాదని ప్రసాద్ చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా ఒకే రోజు ముగ్గురు నేతల వ్యవహార శైలి వివాదం కావడంతో బాబు వారిపై నివేదికలకు ఆదేశాలు జారీ చేశారు. నివేదికలు వచ్చాక వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates