మరో వివాదంలో ‘అనంత’ ఎమ్మెల్యే… రచ్చరచ్చ

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పెను వివాదమే రేగింది. తారక్ తాజా సినిమా వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురంలో తారక్ అభిమానులు సమావేశం ఏర్పాటు చేసుకోగా… సినిమాను అనంతలో ఆడనివ్వనంటూ దగ్గుపాటి వారికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగానే ఆయన తారక్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్… ఈ వ్యవహారంపై వేగంగా స్పందించారు. తాను తారక్ ను ఏమీ అనలేదని, నందమూరి హీరోల అభిమానిగా ఉన్న తాను తారక్ ను ఎందుకు దూషిస్తానని ప్రశ్నించారు. ఇటీవల తనను కొందరు నేతలు రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ తరహా ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆడియోలో ఉన్న వాయిస్ అసలు తనది కానే కాదని ఆయన వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

ఇదిలా ఉంటే… సోషల్ మీడియాలో ఆడియోను చూసినంతనే తారక్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఆదివారం అనంతపురంలోని ప్రసాద్ క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న తారక్ ఫ్యాన్స్ ప్రసాద్ ఫ్లెక్సీలను చించేశారు. ప్రసాద్ కు వ్యతిరేకంగా, తారక్ కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తారక్ ఫ్యాన్స్ వచ్చారన్న విషయం తెలిసిన వెంటనే ప్రసాద్ అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి హుటాహుటీన బలగాలను తరలించి… పరిస్థితిని చక్కదిద్దారు. తారక్ అభిమానులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

ఇక తారక్ అభిమానులు దగ్గుపాటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆడియోలో ఉన్న వాయిస్ దగ్గుపాటిదేనని తేల్చి చెబుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేని తారక్ ను దుర్భాషలాడిన ప్రసాద్ ఏదో సెల్ఫీ వీడియోలో సారీ చెప్పడం కాదని, బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి మరీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని, వాటిని దగ్గుపాటి తట్టుకోలేరని కూడా వారు హెచ్చరించారు. మరి ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.