అమ‌రావ‌తి మ‌రింత దూకుడు.. ప్ర‌తి ప‌నికీ ప‌క్కా లెక్క‌..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులు మ‌రింత దూకుడుగా ముందుకు సాగ‌నున్నాయా? వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ను సైతం త‌ట్టుకునే టెక్నాల‌జీతో ప‌నులు చేయాల‌ని భావిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. నిజానికి చిన్న‌పాటి వ‌ర్షానికే ప‌నులు ఆగిపోయే ప‌రిస్థితి ఉంది. ఇది ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. పైగా.. అమ‌రావతి విష‌యంల అయితే మ‌రింత ఎక్కువ‌గా ఇబ్బందులు వ‌స్తున్నాయి. ప‌క్క‌నే కృష్ణాన‌ది ప్ర‌వ‌హిస్తుండడంతో నీటి ఊట‌లు పెరిగి.. ప‌ది అడుగుల‌కే నీరు చిమ్ముతోంది. దీంతో గ‌తంలో ప‌నులు ఆగిపోయాయి.

అయితే.. ఇప్పుడు 2028 నాటికి అమ‌రావ‌తి తొలి ద‌శ‌ను పూర్తిచేయాల‌ని సంక‌ల్పం పెట్టుకున్న సీఎం చంద్రబాబు.. ఎట్టిప‌రిస్థితిలోనూ.. ప‌నులు అనుకున్న స‌మ‌యానికి పూర్తిచేయాల‌ని భావిస్తున్నారు. దీంతో జ‌ర్మ‌న్ టెక్నాల‌జీని వినియోగించి.. నీటిని తోడేయడంతోపాటు.. ఆవిరి యంత్రాల ద్వారా.. చెమ్మ ఉన్న‌ప్ప‌టికీ.. పిల్ల‌ర్లు వేసేలా ప్ర‌య‌త్నాలు ప్రారంభించాల‌ని ఆదేశాలిచ్చారు. దీంతో ప‌నులు ఆగ‌కుండా ముందుకు సాగాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశం. ఇదేస‌మ‌యంలో నాణ్య‌త‌కు ఎక్క‌డా రాజీ ప‌డొద్ద‌ని కూడా సీఎం చెబుతున్నారు.

ఇక‌, ప్ర‌తి ప‌నికీ లెక్క‌లు చూపాల‌న్న‌ది కూడా సీఎం చంద్ర‌బాబు ఆలోచ‌న‌. అమ‌రావ‌తిలో ఏదో తినేస్తున్నార‌ని.. ప్ర‌తి ప‌నినీ ఎక్కువ ఖ‌ర్చుకు కాంట్రాక్ట‌ర్ల‌కు క‌ట్ట‌బెడుతున్నార‌ని వైసీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీంతో స‌హ‌జంగానే అమ‌రావ‌తిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని భావిస్తున్న చంద్ర‌బాబు ఇక నుంచి ప్ర‌తి ప‌నికీ అయ్యే ఖ‌ర్చును ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఏప‌నికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు? మెటీరియ‌ల్ వివ‌రాలు.. వాటి ఖ‌ర్చు.. వంటివాటిని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తారు.

మొత్తంగా అమ‌రావ‌తి ప‌నుల‌ను సాధ్య‌మైనంత వేగంగా పూర్తిచేయ‌డ‌మే కాకుండా.. వాటిని పార‌ద‌ర్శ‌కంగా కూడా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఎక్క‌డా రాజీ లేని ధోర‌ణితో ముందుకు సాగాల‌ని.. 2028 చివ‌రి నాటికి న‌వ న‌గ‌రాల‌ను పూర్తిచేయాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. దీంతో అమ‌రావ‌తిపై జ‌రుగుతున్న విష ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ప‌నికీ లెక్క‌తోపాటు.. కాలాల‌తో సంబంధం లేకుండా ప‌నులు వేగంగా పూర్తి చేయ‌నున్నారు.