‘ఓట్ చోరీ’ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరింత దూకుడుగా ముందుకు సాగనున్నారు. ఒకరకంగా ఆయన ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ‘ఓట్ అధికార్ యాత్ర’ పేరుతో రాహుల్‌గాంధీ ఆదివారం నుంచి 16 రోజుల పాటు యాత్ర చేయనున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌లో దాదాపు 65లక్షల మంది ఓటర్లను తొలగించారని.. పేర్కొంటున్న రాహుల్ గాంధీ ఇప్పటికే జాతీయ స్థాయిలో దీనిపై పెద్ద చర్చే పెట్టారు. ఓ వారం కిందటి వరకు ఈ వ్యవహారం ఎలా ఉన్నా.. గత నాలుగైదు రోజులుగా మాత్రం దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఈ వేడిని కొనసాగిస్తూ.. మరింత దూకుడుగా రాహుల్ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం నుంచి ఆయన బీహార్‌లోని ససారం నియోజకవర్గం నుంచి ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రారంభించనున్నారు. మొత్తం 20కి పైగా జిల్లాల్లో ఆయన ఈ యాత్రచేపట్టనున్నారు. గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ .. ఇప్పుడు అదే తరహాలో ఈ యాత్రను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తద్వారా కేంద్రం సహా, ఎన్నికల సంఘంపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. 1300 కిలో మీటర్లకు పైన రాహుల్ ఈ యాత్ర చేపట్టనున్నారు. ఓట్ చోరీ హక్కు కాదని.. ఓటును కలిగి ఉండడమే హక్కు అని ఆయన పేర్కొంటున్నారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు చోర్(దొంగ) కంటే దారుణంగా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు.
దీంతో ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడనుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. మరోవైపు ‘ఇంటింటికీ’ పేరుతో యువ జన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శనివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆ ఇంట్లోని వారి ఓట్లను, అధికారిక ఓట్ల జాబితాతో పోల్చి సరిచూడనున్నారు. ఒక వ్యక్తి-ఒక ఓటు నినాదంతో ముందుకు సాగనున్నారు. ప్రతి ఒక్క ఓటును పరిశీలించి.. చౌర్యానికి గురైన ఓట్లను తిరిగి పొందేలా ప్రజలకుఅవగాహన కల్పించనున్నారు. దీనిని కూడా దేశవ్యాప్తంగా నిర్వహించేలా రాహుల్‌గాంధీ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు.
డిజిటల్ యుద్ధం..
ఇదిలావుంటే.. డిజిటల్ రూపంలోనూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓటు చౌర్యంపై పెద్ద ఎత్తున యుద్ధం ప్రారంభించారు. ఇప్పటికే షార్ట్ ఫిల్మ్స్ సహా.. వీడియోల రూపంలో ఓటు చౌర్యంపై ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీటిని మిలియన్ల మంది లైక్ చేయడంతోపాటు.. కామెంట్లు కూడా చేస్తున్నారు. తాజాగా ‘లాపతా ఓటు’ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. దీనిలో ఓ వ్యక్తి తన ఓటు గల్లంతైందని.. పేర్కొంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆ వెంటనే పోలీసులు తమ ఓటు సంగతేంటని.. జాబితాలో పరిశీలించుకుంటారు. ఈ క్రమంలో వారి ఓట్లు కూడా గల్లంతైన విషయాన్ని తెలుసుకుని నిర్ఘాంత పోతారు. ఈ వీడియోకు కూడా లక్షల మంది లైకులు కొట్టడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates