ఢిల్లీ టూర్లపై రేవంత్ దిమ్మతిరిగే కౌంటర్!

తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన ఢిల్లీ టూర్లపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై శుక్రవారం అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొలువై ఉండే ఢిల్లీకి కాకుండా… దుబాయి వెళతానా? అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని ఆయన తానేమీ ఇతర నేతల మాదిరిగా దోచేసిన డబ్బును దాచుకునేందుకు దుబాయి వెళ్లలేదని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగానే విపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయనే చెప్పక తప్పదు. భారత 79 స్వాతంత్య్ర దినోత్సవాన ప్రముఖ ప్రాపర్టీ సంస్థ క్రెడాయ్ నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రాజెక్టుల అనుమతుల కోసమే ఢిల్లీ వెళుతున్నానన్న రేవంత్ రెడ్డి…అలా ఢిల్లీ వెళ్లినప్పుడు ఆయా రాష్ట్రాల సీఎంలు బస చేసేందుకే ఢిల్లీలో కేంద్రం ప్రత్యేకంగా సర్కారీ బంగ్లాలు కేటాయిస్తుందని కూడా ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో బంగ్లా కేటాయిస్తే… దానిని ఏదో ఫామ్ హౌజ్ లా మార్చేసుకుని పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేసేందుకు తాను వినియోగించడం లేదని కూడా బీఆర్ఎస్ కు ఆయన చురకలు అంటించారు. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ప్రధాని, కేంద్ర మంత్రులు ఉన్న ఢిల్లీకి కాకుండా విహార యాత్రలు చేసేందుకు తానేమైనా దుబాయి వెళుతున్నానా? అని కూడా రేవంత్ ప్రశ్నించారు.

తాను సీఎం అయ్యాక చాలా సార్లు ఢిల్లీ వెళ్లిన మాట వాస్తవమేనన్న రేవంత్… ఆ పర్యటనల్లో రాష్ట్రానికి సంబంధించి చాలా అనుమతులు సాధించుకుని వచ్చానని చెప్పారు. గడచిన పదేళ్ల పాటు ఈ సోయి లేని పాలకులు… ఢిల్లీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్ని అథో:గతి పట్టించారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిలు హైదరాబాద్ అభివృద్ధి కోసం అహరహం శ్రమించారని ఆయన అన్నారు. అయితే ఆ సమయంలోనూ వారిపైనా విపక్షాలు ఇలాగే ఆరోపణలు గుప్పించాయని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని రాష్ట్రాభివృద్ధికి పాటు పడేలా విపక్షాలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.