బాల‌య్య ఇలాకాలో జ‌గ‌న్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్నారా…?

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం పార్టీ అధినేత జగన్‌కు ఉంది. అయితే టిడిపి కంచుకోటలో పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తూ మరింతగా దిగజారుతున్న వాతావరణం కనిపిస్తోంది.

తెలుగుదేశం కంచుకోట హిందూపురం నియోజకవర్గం.. ఇక్కడ నుంచి నందమూరి బాలకృష్ణ వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. వైసిపి ఆవిర్భావం నుంచి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల పార్టీ వరుసగా మూడుసార్లు ఓడిపోయిందన్న అభిప్రాయం వైసిపి కార్యకర్తల్లోనే ఉంది. రాష్ట్రం అంతటా పార్టీ బలంగా ఉన్న 2019 ఎన్నికలలో కూడా హిందూపురంలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. హిందూపురం వైసీపీలో మొదటి నుంచి వర్గ పోరు తీవ్రంగా ఉంది.

ముందు కాంగ్రెస్ లో ఉన్న నవీన్ నిశ్చ‌ల్ వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో ఆయన బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల సమయానికి మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ ని తెరమీదకు తీసుకు వచ్చింది. ఆయన వచ్చాక ఇక్కడ గ్రూపులు మరింతగా పెరిగిపోయాయి. ఓవైపు నవీన్ వర్గం.. మరోవైపు ఇక్బాల్ వర్గం.. అదే టైంలో హత్యకు గురైన చౌడూరు రామకృష్ణారెడ్డి వర్గం ఇలా మూడు ముక్కలాట నడిచింది. 2024 ఎన్నికల సమయానికి ఇక్బాల్ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. అదే టైంలో ఇన్చార్జిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కురుబ దీపికను సీన్లోకి తీసుకువచ్చారు. 2024 ఎన్నిక‌ల్లో మరోసారి వైసిపి ఓడిపోయింది.

ఇక ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి త‌ర్వాత కూడా ఇక్క‌డ గ్రూపుల గోల త‌ప్ప‌డం లేదు. న‌వీన్ 2029 ఎన్నిక‌ల్లో తానే అభ్య‌ర్థిని అంటూ ప్ర‌చారం చేసుకున్నారు. కొండూరు వేణుగోపాల్ రెడ్డి కూడా టిక్కెట్ త‌న‌దే అంటున్నార‌ట‌. దీనిపై ఇన్‌చార్జ్ పిల్లి దీపిక‌తో పాటు పార్టీ ప‌రిశీల‌కులు ర‌మేష్‌రెడ్డి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం అటు న‌వీన్ నిశ్చ‌ల్‌తో పాటు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. దీంతో న‌వీన్‌, వేణుగోపాల్ వ‌ర్గం ఎటు వైపు వెళ్లాలో తెలియ‌ని ప‌రిస్థితి. దీపిక పార్టీ కేడ‌ర్‌ను ఏక‌తాటిమీద‌కు తెచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. ఏదేమైనా హిందూపురం విష‌యంలో జ‌గ‌న్ చేస్తోన్న త‌ప్పులు పార్టీని మ‌రింత దిగ‌జారుస్తున్నాయి.