రోజాను అరెస్టు చేయాలా.. వ‌ద్దా …!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, మాజీ మంత్రి రోజా వ్య‌వ‌హారం వైసీపీలోనే కాదు.. కూట‌మిలో కూడా చ‌ర్చనీయాంశంగా మారింది. ఆమె మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ‘ఆడుదాం ఆంధ్ర‌’ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని.. పేర్కొంటూ కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. దీనిపై దృష్టి పెట్టిన విజిలెన్స్ అధికారులు తాజాగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి అందించారు. దీనిలో సుమారు 40 కోట్ల రూపాయ‌ల లోపు అక్ర‌మాలు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.

దీంతో ఆమెపై చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం రెడీ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనిపైనే వైసీపీ ఫోక‌స్ పెంచింది. రోజాపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంటే.. అది ఫ‌స్ట్ ఉమెన్ మాజీ మినిస్ట‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు అవుతుంది. దీనిని హైలెట్ చేస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని, మ‌హిళ‌ను సైతం వేధించార‌న్న వాద‌న‌ను వినిపిం చి సానుభూతి కోసం ప్ర‌య‌త్నించాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. దీనివ‌ల్ల త‌మ గ్రాఫ్ పెరిగినా.. పెర‌గ‌క పోయినా.. ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా మ‌హిళ‌ల్లో సానుభూతి ప‌వ‌నాలు పెంచుకోవాల‌ని భావిస్తోంది.

ఇక‌, ఇదే విష‌యంపై కూట‌మిలో కూడా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌హిళానాయ‌కులు రోజా అరెస్టు కోసం వెయిట్ చేస్తున్నార‌న్న‌ది ఓ వ‌ర్గం వాద‌న‌గా ఉంది. రోజాపై చాలా మంది మ‌హిళా నాయ‌కులకు ఆగ్రహం వుంది. మ‌రీ ముఖ్యంగా సీమ‌కు చెందిన మ‌హిళా నాయ‌కులు రోజా అరెస్టు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఇదేస‌మ‌యంలో కూట‌మిలోని మ‌రో కీల‌క పార్టీ మాత్రం ఈ విష‌యంపై ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల‌ని కోరుతోంది. సినీ నేప‌థ్యం ఉన్న నాయ‌కురాలు కావ‌డంతో ఆమె విష‌యంలో తొంద‌ర పాటు చ‌ర్య‌లు స‌రికాద‌న్న‌దివారి ఉద్దేశం.

అంతేకాదు.. కేవ‌లం 40 కోట్ల రూపాయ‌ల కోసం.. రోజాను అరెస్టు చేస్తే.. ఇబ్బందులు వచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని ఈ కూట‌మి పార్టీలో నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో ప్ర‌భుత్వం ఏం చేస్తున్న‌ది చూడాలి. అయితే.. టీడీపీలోనే మ‌రో వాద‌న వినిపిస్తోంది. ఈ కేసును.. అలా తొక్కిపెట్టి స‌మ‌యానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా రోజాను కంట్రోల్ చేయొచ్చ‌ని వారు చెబుతున్నారు. ఇప్ప‌టికే రోజా దాదాపు సైలెంట్ అయిపోయార‌ని.. ఇప్పుడు ఆమెపై చ‌ర్య‌లు తీసుకునే బ‌దులు కొన్నాళ్ల పాటు ఆమెను నిలువ‌రించేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేయాల‌న్న‌ది మ‌రికొంద‌రు చెబుతున్న మాట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.