మంగ‌ళ‌గిరితో ‘బ్రాహ్మ‌ణి’ బాండింగ్‌.. పెద్ద స్ట్రాట‌జీ!

మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న స‌తీమ‌ణి, బాల‌య్య కుమార్తె నారా బ్రాహ్మ‌ణి సంద‌డి చేశారు. ఉద‌యం 12 గంట‌ల స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చిన ఆమె.. సాయంత్రం 6 వ‌ర‌కు ప‌లు ప్రాంతాల్లో పర్య‌టించారు. ముఖ్యంగా చేనేత కార్మికులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలించారు. నూత‌నంగా తీసుకువ‌చ్చిన డిజైన్ల‌ను ప‌రిశీలించి.. సంతృప్తి వ్య‌క్తం చేశారు.

అనంత‌రం.. మ‌హిళ‌ల కోసం తాను స్వ‌యంగా ఏర్పాటు చేసిన ‘స్త్రీ శ‌క్తి’ కుట్టు శిక్ష‌ణా కేంద్రాల‌ను ప‌రిశీలించారు. వారి శిక్ష‌ణను అడిగి తెలుసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు బ్యాచ్‌లుగా శిక్ష‌ణ పొందిన వారు సొంత‌గానే కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా స్థిరత్వం పొందుతున్న తీరును ఆమె తెలుసుకున్నారు. అనంత‌రం.. స్థానిక పార్కులో స్వ‌యంగా తాను సొంత ఖ‌ర్చుతో ఏర్పాటు చేయించిన పిల్ల‌లు ఆడుకునే ప‌రిక‌రాలు.. వ‌స్తువుల‌ను నారా బ్రాహ్మ‌ణి ప‌రిశీలించారు.

ఇక‌, మ‌ధ్య మార్గంలో ప్ర‌సిద్ధ‌ పాన‌కాల‌స్వామి ఆల‌యాన్ని కూడా నారా బ్రాహ్మ‌ణి సంద‌ర్శించారు. ఈసమయంలోఆమెకు నారా లోకేష్ సొంత ఖ‌ర్చుతో కొనుగోలు చేసి ఇచ్చిన ఉచిత బ‌స్సు తార‌స ప‌డింది. దీంతో ఆమె అందులోని ప్ర‌యాణికుల‌తో ముచ్చ‌టించారు. స్వామివారి ద‌ర్శ‌నాలు ఎలా ల‌భిస్తున్నాయ‌ని.. కొండ పై ఎలాంటిర‌ద్దీ ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇలా.. నారా బ్రాహ్మ‌ణి.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించడం.. స్థానికులో ముచ్చ‌టించ‌డం గ‌మ‌నార్హం.

ఇదే తొలిసారికాదు!..

నారా బ్రాహ్మ‌ణి.. త‌న భ‌ర్త నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి కాదు.గ‌తంలోనూ రెండు మూడు సార్లు ఆమె ప‌ర్య‌టించారు. అప్ప‌ట్లో ఏకంగా పొలాల్లోకి వెళ్లి నాట్లు కూడా వేశారు. గ్రామీణ మంగ‌ళ‌గిరిలోని ప‌ల్లెల్లోనూ ప‌ర్య‌టించారు. ఇలా.. చేయ‌డం ద్వారా.. స్థానికుల మ‌న‌సులో ప్ర‌త్యేక ముద్ర వేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు.. వారితో ప‌రిచ‌యాలు కూడా పెరుగుతాయి. ఇది రాజ‌కీయాల‌ను మించి మ‌రింత ఎఫెక్ట్ గా ప‌నిచేస్తుందన్న‌ది తెలిసిందే. ఇదే స్ట్రాట‌జీని నారా బ్రాహ్మ‌ణి కూడా ఫాలో అవుతున్నారు. త‌ద్వారా మాన‌సికంగా కూడా మంగ‌ళ‌గిరితో బాండింగ్ పెంచుకుంటున్నారు.