స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి చేసిన కామెంట్ సంచలనంగా మారింది. నిమ్మగడ్డ గురించి జేసీ మాట్లాడుతూ వాయిదా పడిన ఎన్నికలను నిర్వహించకుండానే రిటైర్ అయిపోతారంటు తేల్చి చెప్పేశారు. ప్రభుత్వ సహకారం లేకుండా నిమ్మగడ్డ ఒక్కరే ఎన్నికలను నిర్వహించగలరా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ మళ్ళీ కోర్టుకెళితే తాను రిటైర్ అయ్యేలోగా కోర్టులో తీర్పు రాదంటూ కుండబద్దలు కొట్టినట్లు జేసీ చెప్పేశారు.
ఎన్నికల నిర్వహణకు ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల కమీషన్ మధ్య మంచి సమన్వయం ఉన్నపుడే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలు నిర్వహించాలంటే అవసరమైన నిధులతో పాటు యంత్రాంగాన్ని సమకూర్చాల్సింది కూడా ప్రభుత్వమే అన్న విషయాన్ని నిమ్మగడ్డ మరచిపోయినట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు. వాయిదాపడిన ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయని తానైతే అనుకోవటం లేదంటు అనుమానాలు వ్యక్తం చేశారు.
ప్రతి విషయంలోను ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య వివాదాలు రేగుతున్నపుడు ప్రభుత్వం తనకు సహకరిస్తుందని కమీషనర్ ఎలా అనుకుంటారంటూ ఎదురు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూసిన తర్వాత తాను అనుకున్నది సాధించటానికి ఎంత దూరమైనా వెళతారనే విషయం ఈపాటికే అందరికీ అర్ధమైపోయిందన్నారు. ఒకసారి సుప్రింకోర్టులో కేసు పడితే మార్చిలోగా విచారణ జరగటం సాధ్యం కాదన్నారు.
తాను రిటైర్ అయ్యేలోగా ఎన్నికలను నిర్వహించాలనే ప్రయత్నాలు చేయటం వృధా ప్రయాసే అంటు నిమ్మగడ్డకు వాస్తవాన్ని వివరించారు జేసీ. ముందు హైకోర్టులో కేసు వేయాలి. తర్వాత విచారణ జరగేటప్పటికే టైం అయిపోతుందన్నారు. ఒకవేళ హైకోర్టులో నిమ్మగడ్డ గెలిచినా ప్రభుత్వం వెంటనే సుప్రింకోర్టుకు వెళుతుందన్నారు. అక్కడ కేసు విచారణ దశలోనే నిమ్మగడ్డ పదవీ కాలం అయిపోతుందని జేసీ అభిప్రాయపడ్డారు. మరి జేసీ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాల్సిందే.