అధికారంలో ఉంటే ఒకరకంగా, అధికారం పోయాక మరొరకంగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తాయన్న పేరుంది. దీనికి వైసీపీ చేస్తున్న రాజకీయాలే ఉదాహరణగా మారాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మరిచిపోయినట్టు వ్యవహరిస్తోందని టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.
దీనికి కారణం ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిలో ఎవరు గెలిచినా మహా అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. అయినప్పటికీ, జగన్ సొంత జిల్లా కడప కావడం, అందునా ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కావడంతో ఇక్కడ పాగా వేయాలన్నది సాధారణంగా ప్రత్యర్థి పార్టీ చేసే ఆలోచన. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించిన మాట కూడా వాస్తవమే.
అయితే ఏదో జరిగిపోతోందని, హత్యా రాజకీయాలకు తెరదీశారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. పులివెందులలో స్వేచ్ఛలేకుండా పోయిందని అంటున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం గతాన్ని మరిచిపోతే ఎలా అంటూ వైసీపీపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
కుప్పంలో జరిగిన పోరు సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా, అప్పట్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేదా? ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు టీడీపీ నేతలను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు. గతాన్ని మరిచిపోయి ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ యాగీ చేయడం ఎందుకని నిలదీస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైసీపీ హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది. ఇప్పుడు మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదో చేస్తోందని యాగీ చేయడం ఎందుకని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates