చర్చలకు కూడా ఛాన్స్ ఇవ్వని ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న మరో నిర్ణయం మరోసారి భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో కొత్త మలుపుని తేవడమే కాక, సంబంధాలను మరింత ఉద్రిక్తత వైపు నెట్టేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో భారత్‌పై ఇప్పటికే 25 శాతం ఉన్న టారిఫ్‌ను 50 శాతానికి పెంచినట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్‌ యాజమాన్యం రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలే ముఖ్యమని, వాటిని కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్యకు సిద్ధమేనని స్పష్టం చేసింది.

అయితే, భారత్ ప్రభుత్వం ట్రంప్ విధించిన అధిక సుంకాలపై చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. ట్రంప్ మాత్రం వాణిజ్య చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఖరాఖండిగా చెప్పేశారు. ఒవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా “టారిఫ్ వివాదం పరిష్కారం అయ్యేంత వరకూ భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరగవు” అంటూ ఆయన తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే, ఇదే సమయంలో అమెరికా విదేశాంగ శాఖ మాత్రం కొంత సంయమనంతో వ్యవహరిస్తోంది. ఆ దేశ అధికార ప్రతినిధి టామీ పిగోట్ మాట్లాడుతూ, “భారత్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి. సంబంధాల్లో ఉద్రిక్తత ఉన్నా, పూర్తి స్థాయి చర్చలకు మేము సిద్ధమే” అని చెప్పారు. దీనివల్ల అమెరికాలో రాజకీయంగా వేర్వేరు అభిప్రాయాలు ఉన్నా, ఆ దేశ పాలక వ్యవస్థలో చర్చలకు దారులు తెరిచే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ పరిణామాలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ ప్రభుత్వం కూడా తమ నైపుణ్యాన్ని, దృఢతను చూపుతోంది. రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలు ఎప్పుడు ముఖ్యమేనని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. “అవసరమైతే అదనపు భారాన్ని భారత ప్రభుత్వం మోయడానికి సిద్ధంగా ఉంది. దేశ ప్రయోజనాలపై ఏమాత్రం రాజీ పడబోము” అని అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా, ట్రంప్ తీరుతో భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు సంక్లిష్టంగా మారాయి. తాత్కాలికంగా చర్చలకు బ్రేక్ పడినప్పటికీ, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక ప్రయోజనాలు వల్ల భవిష్యత్తులో తిరిగి చర్చలు జరిగే అవకాశం ఉంది.