‘కేసీఆర్ స్వార్థ జీవి… నేను అమ్ముడు పోలేదు’

బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు కూడా కాకముందే ఆ పార్టీ తాజా మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్‌పైనా, తనను టార్గెట్ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై ఆయన నిప్పులు చెరిగారు.

కేసీఆర్‌ను స్వార్థ జీవిగా గువ్వల అభివర్ణించారు. కేసీఆర్ స్వార్థానికి తాను బలి అయ్యానన్నారు. తనను అసమర్థ నాయకత్వం ఓడించిందంటూ బీఆర్‌ఎస్ అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. ఎక్కడికక్కడ రాజీ పడి, రాజకీయాలను నాశనం చేశారని, రాష్ట్రంలో అప్పులు తెచ్చిపెట్టారని గువ్వల కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదే సమయంలో తాను 100 కోట్ల రూపాయల‌కు అమ్ముడుపోయానని కొందరు అంటున్నారనీ, కానీ గువ్వల ఒకరి మోచేతి నీళ్లు తాగే టైపు కాదని వ్యాఖ్యానించారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో అయినా, ఎక్కడైనా తాను 100 కోట్ల రూపాయల‌కు అమ్ముడుపోయానని నిరూపిస్తే ఆధారాలు చూపాలని, అలా అయితే ముక్కు నేలకు రాస్తానని, రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని సవాల్ విసిరారు.

తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవంతోనే ఆ పార్టీలో చేరానన్న గువ్వల, తొలినాళ్లలో ఆయన బాగానే ఉన్నారని, కానీ తర్వాత స్వార్థ జీవిగా మారారన్నారు. గత ఎన్నికల్లో తనను మాయ చేసి టికెట్ అమ్ముకున్నారనీ మండిపడ్డారు.

ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ తన పాత్రను సరిగా పోషించడం లేదని గువ్వల వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా ప్రజలను గాలికి వదిలేశాయని ఆరోపించారు. కార్యకర్తలను వాడుకుని వదిలేశారనీ, వారిని కష్టకాలంలో పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రజలు కోరుకుంటున్న విధంగా ప్రభుత్వం పాలన చేయడం లేదన్న గువ్వల, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్షం కూడా ప్రవర్తించడం లేదని దుయ్యబట్టారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రజల సమస్యలను వదిలేస్తున్నారని, ప్రజల తరఫున గళం వినిపించాలన్న ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు.

ఈ క్రమంలో తనకు ఏ పార్టీలో స్వేచ్ఛ ఉంటే అక్కడికే వెళ్తానన్నారు.