దిగజారి బ్రతకలేనంటోన్న రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత పోరు కొత్త కాదు. అయితే, ఈసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనప్పటి నుంచి సీనియర్ నేతలు అందరూ కాస్త గుర్రుగా ఉన్నారు. ఇక, మంత్రివర్గ విస్తరణ సమయంలో కొంతమంది సీనియర్ నేతలను, కాంగ్రెస్ వాదులను కాదని కొత్త వారికి మంత్రి పదవులివ్వడం కూడా చాలామందికి నచ్చలేదు. ఆ జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి..తాజాగా మరోసారి బహిరంగంగానే ఆ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది అధిష్టానం ఇష్టమని, వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి, తనకంటే జూనియర్లకు కూడా మంత్రి పదవి ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఎవరి కాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలని తాను అనుకోవడం లేదని, దిగజారి బతకడం తనకు తెలియదని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరోసారి త్యాగానికైనా సిద్ధమని, రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోనని అన్నారు. మునుగోడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. తనకు మంత్రి పదవి వస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు.

పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తానని తనతో అన్నారని, భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తాను అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునే వాడిని కాదని, తనకు పదవి ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఉంటే మంత్రి పదవి దక్కేదని, కానీ, మునుగోడు ప్రజల కోసమే ఇక్కడి నుంచి పోటీ చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మరి పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఆయన చేసిన కామెంట్లపై పార్టీ అధిష్టానం రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

కాగా, తన సోదరుడి కామెంట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. ఇది జాతీయ పార్టీ అని, హై కమాండ్ , సీఎం రేవంత్ రెడ్డి కలిసి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇందులో తన ప్రమేయంగానీ, ఇతర నేతల ప్రమేయం గానీ ఉండవని అన్నారు. తన చేతుల్లో ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలో సీనియర్లమని, ఆరు సార్లు గెలిచామని అన్నారు. అయినా సరే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు.