జగన్ చుట్టూ ఇక ‘ప్రైవేట్’ రక్షకులు!

ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వంపై పూర్తిగా విశ్వాసం కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదికి ముందు తాను కూడా రాష్ట్రాన్ని పాలించిన అనుభవాన్ని మరిచిన జగన్… ప్రభుత్వ యంత్రాంగం గౌరవం దిగజారేలా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు రేకెత్తుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే జగన్ కు సరిపడ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నా… ఆయన మాత్రం ఏకంగా 50 మంది దాకా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరామర్శల పేరిట పర్యటనలు చేస్తున్న జగన్… తన పార్టీ అనుచర గణాన్ని భారీ ఎత్తున ఆయా కార్యక్రమాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో అయితే ఓ వైసీపీ కార్యకర్త జగన్ కారు కిందే నలిగిపోతే…మరో కార్యకర్త ర్యాలీలో ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఈ ఘటన పెను సంచలనమే రేపింది. దీంతో జగన్ పర్యటనలపై ప్రభుత్వం ఆంక్షలు విధించగా… జగన్ మాత్రం తనపై కక్షపూరిత చర్యలు చేపడుతున్నారంటూ విమర్శిస్తున్నారు.

తాజాగా తన పర్యటనలకు ప్రభుత్వం సరిపడ భద్రతను కల్పించడం లేదని భావించిన జగన్… ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించారు. అందులో బాగంగా పార్టీ యంత్రాంగం ప్రభుత్వ సెక్యూరిటీతో సంబంధం లేకుండా ఓ 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించింది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే సోమవారం వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఆర్మీకి చెందిన 10 మందిని జగన్ కు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. వెరసి జగన్ కు మొత్తంగా 50 మంది ప్రైవేట్ సెక్యూరిటి పర్సనల్ అందుబాటులోకి వస్తున్నారు. త్వరలో జగన్ డోన్ లో జరిపే పర్యటనతో ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అందుబాటులోకి రానుందట.

ఇదిలా ఉంటే… ఎన్నికల కోడ్ అమలులో ఉండగా… కోడ్ నియమావళిని ఉల్లంఘించిన జగన్ గుంటూరు మిర్చీ యార్డులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ పర్యటనలో జగన్ కు సర్కారీ సెక్యూరిటీ లబించలేదు. దీంతో తనకు కొనసాగుతున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని జగన్ హైకోర్టును కోరారు. కోర్టు కేంద్రాన్ని సంప్రదించగా…జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాల్సిన అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో షాక్ తిన్న జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ మంత్రాన్ని ఎంచుకున్నారు.