మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలు, మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఆమెను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కో-చైర్మన్‌గా నియమించారు.
ఈ నేపథ్యంలో మెగా స్టార్ సహా ఉపాసన ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. తనను కో చైర్మన్‌గా నియమించినందుకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో పూర్తి చేస్తానని ఉపాసన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. తనపై ఉన్న నమ్మకంతో ఈ పదవిని అప్పగించారని.. దీనికి న్యాయం చేస్తానని ఆమె పేర్కొన్నారు.
కాగా మెగా కుటుంబానికి సుదీర్ఘ కాలం తర్వాత ప్రభుత్వ పదవి దక్కడం ఇదే తొలిసారి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్–2025 పేరుతో ఇటీవల ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
వచ్చే ఒలింపిక్స్ కోసం రాష్ట్రం నుంచి యువ క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఈ కమిటీ పనిచేయనుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్రీడలను ప్రోత్సహించే బాధ్యత కూడా ఈ కమిటీపై ఉంటుంది.
ఈ కమిటీకి చైర్మన్‌గా సంజయ్ గోయంకాను ప్రభుత్వం నియమించింది. ఇవి స్వచ్ఛంద పదవులే అయినప్పటికీ క్రీడా రంగంలో సెలబ్రిటీలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉపాసనను ఎంపిక చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates