రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతల వ్యవహారమే చాలా విచిత్రంగా మారిపోయింది. మరి ఏమి చూసుకుని రెచ్చిపోతున్నారో తెలీదు కానీ తిరుపతి పార్లమెంటు ఉఫఎన్నికలో గెలుపు తమదే అంటు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇంతటితో ఆగితే బాగానే ఉండేది 2024లో రాష్ట్రంలో అధికారంలోకి కూడా వచ్చేస్తున్నామంటూ భీకర ప్రకటనలు చేసేస్తుండటమే అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తోంది. గెలుపు సంగతి పక్కనపెట్టేస్తే అసలు బీజేపీకి తన ప్రత్యర్ధి ఎవరో అయినా తెలుసా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రకటనలు చేస్తున్న నేతలకు అసలు తమ బలమేమిటో తెలిసుకునే మాట్లాడుతున్నారా లేకపోతే జనాలను పిచ్చోళ్ళని అనుకుంటున్నారో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు గెలిచిపోయారు. నిజానికి తమ పార్టీ గెలుస్తుందని కమలం నేతలకే నమ్మకం లేదు. అలాంటిది లాటరీ తగిలినట్లుగా గెలిచిపోవటంతో ఇక వాళ్ళను పట్టడం ఎవరి వల్లా కావటం లేదు. దుబ్బాకలో కేసీయార్ నే ఓడించేశాము ఇక ఏపిలో జగన్మోహన్ రెడ్డి ఎంత అంటు రఘునందనరావు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది.
మొదటినుండి కూడా తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేరు ఏపిలో రాజకీయ వాతావరణం వేరన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. మొదటినుండీ ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలోనే బీజేపీకి అంతో ఇంతో ఆదరణుంది. ఇక తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక గురించి మాట్లాడితే మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు 7,17,294 ఓట్లు వచ్చాయి. ఓడిపోయిన టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీకి 4,90,605 ఓట్లొచ్చాయి. అంటే సుమారు 2.28 లక్షల ఓట్ల మెజారిటితో వైసీపీ గెలిచింది. ఇక మూడోస్ధానంలో నిలబడింది ఎవరో తెలుసా నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్).
అవును మీరు చదివింది నిజమే. మూడో స్ధానంలో నోటాకు 25750 ఓట్లొచ్చాయి. నాలుగో స్ధానంలో కాంగ్రెస్, ఐదేస్ధానంలో జనసేన మద్దతుతో నిలబడిన బహుజన సమాజ్ పార్టీ అభ్యర్ధి నిలిచారు. ఆరోస్ధానంలో బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 16 వేలు. అంటే లెక్కప్రకారం బీజేపీకి ప్రత్యర్ధిగా ముందు బిఎస్పీ అభ్యర్ధి ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధి నిలబడతారు. వీళ్ళని దాటుకుంటేనే నోటా ప్రత్యర్ధి అవుతారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లు దాటితే అదే చాలా పెద్ద అచీవ్ మెంటని చెప్పుకోవాలి.
ఎన్నికల లెక్కలు, క్షేత్రస్ధాయిలో వాస్తవాలు ఇలాగుంటే దుబ్బాక ఎంఎల్ఏ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుండటమే విచిత్రంగా ఉంది. తెలంగాణాలో కేసీయార్ మీద వ్యతిరేకత పెరుగుతోందని దుబ్బాక ఉపఎన్నికలకు ముందే జనాలకు అర్ధమైంది. కానీ ఏపిలో జగన్ పై జనాల్లో వ్యతిరేకత ఉన్నదో లేదో తెలీదు.
ఎందుకంటే జగన్ పై వ్యతిరేకతంతా చంద్రబాబు, లోకేష్+మద్దతు మీడియాలో మాత్రమే కనబడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల జనాల్లో జగన్ పై మరింత సానుకూలత ఏర్పడిందని వైసీపీ నేతలంటున్నారు. మరి ఎవరి వాదన వాస్తవమో తేలాలంటే ఉపఎన్నిక జరగక తప్పదు. అప్పటిలోగా తన అసలు బలమేంటో తెలుసుకుంటే కమలనాదులకే మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates