‘రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని నాకు బీజేపీ అగ్ర నేతలు స్పష్టంగా చెప్పారు’ ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాట. రాజధాని ప్రాంతంలోని రైతుల కుటుంబాలతో పాటు జనసైనికులతో జరిగిన సమావేశంలో పవన్ చెప్పిన మాటలు. పవన్ చేసిన తాజా ప్రకటన ఫక్తు అబద్ధమని అర్ధమైపోతోంది. ఒకవైపు రాజధాని వివాదంపై కోర్టులో నడుస్తున్నకేసులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజధాని అంశంపై ఒకసారి కాదు మూడుసార్లు అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం.
మూడు అఫిడవిట్లలో కూడా రాజధాని అంశంతో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పేసింది. రాజధాని అన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశమే అని తేల్చి చెప్పేసింది. అంతే కాకుండా చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు కూడా కేంద్రం జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని గుర్తు చేసింది. అమరావతిని చంద్రబాబు రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేసిన విషయాన్ని కూడా గుర్తు చేసింది.
రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం వైఖరి ఇంత స్పష్టంగా ఉంటే బీజేపీ అగ్రనేతలు అమరావతే రాజధానిగా ఉంటుందని పవన్ కు ఎవరు చెప్పినట్లు ? ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలంటే ఎవరు పవన్ దృష్టిలో ? రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియోధరేనా ? రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికే జోక్యం లేదంటే ఇక జాతీయ పార్టీకి ఏమీ సంబంధం ఉంటుంది ? ఎందుకు జోక్యం చేసుకుంటుంది ? అమరావతి విషయంలో పవన్ చేసిన ప్రకటన ఏమాత్రం నమ్మేట్లుగా లేదు.
ఏదో రాజధాని ప్రాంతంలోని రైతులతోను, జనసైనికులతో సమావేశం పెట్టారు కాబట్టే నోటికొచ్చింది మాట్లాడేసినట్లుంది చూస్తుంటే. కర్నూలుకు వెళ్ళి కర్నూలే రాజధాని అని వైజాగ్ వెళ్ళినపుడు వైజాగే రాజధానని పవన్ ప్రకటనలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబునాయుడు భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని, ఆమరణ నిరాహార దీక్షలు చేస్తానని భీకరంగా ప్రకటనలు చేసి మళ్ళీ రాజధాని ప్రాంతం మొహం కూడా చూడని పవన్ ఇపుడు కొత్త డ్రామాలు ఆడుతున్నట్లే అనుమానంగా ఉంది. ఏరోటి కాడ ఆ పాట పాడే పవన్ ప్రకటనను కూడా ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారా ?
Gulte Telugu Telugu Political and Movie News Updates