తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చిర్రెత్తు కొచ్చింది. మమ్మల్ని 9గంటలకే రమ్మని.. పదే పదే చెప్పి.. 10గంటలకు మీరు వస్తారా? అంటూ.. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి కార్యక్రమానికి హాజరు కావాల్సిన కోమటిరెడ్డి సదరు కార్యక్రమానికి ఏకంగా డుమ్మా కొట్టారు. దీంతో ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. మరో వైపు.. కోమటిరెడ్డి లేకుండానే.. మంత్రి ఉత్తమ్ సదరు కార్యక్రమంలో పాల్గొని పూర్తి చేశారు.
ఏం జరిగింది?
మంగళవారం.. నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సిద్దమయ్యారు. అయితే.. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా తీసుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ స్వయంగా ఫోన్ చేసి.. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే కార్యక్రమానికి రావాలని కోరారు. దీనికి కోమటి రెడ్డి కూడా ఓకే చెప్పారు. మంగళవారం ఉదయం 9 గంటల కల్లా బేగంపేట విమానాశ్రయానికి రావాలని కోరారు.
అక్కడి నుంచి ఇరువురు కలిసి వెళ్లి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఉదయం 9గంటల కల్లా.. బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఆ సమయానికి చేరుకోలేదు. ఐదు నిమిషాలు.. పదినిమిషాలు అంటూ.. కోమటిరెడ్డికి ఫోన్ చేసి.. వెయిట్ చేయించారు. తీరా ఉత్తమ్ వచ్చే సరికి 10.10 నిమిషాలైంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన వెంకటరెడ్డి.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నేను కూడా మంత్రినే.. నాకు కూడా పనులుంటాయి.“ అంటూ.. బేగం పేట విమానాశ్రయం నుంచే వెనక్కి వచ్చేశారు. ఇక, వెంకటరెడ్డితో వాదన ఎందుకులే.. అనుకున్న ఉత్తమ్.. సంబంధిత అధికారులతో కలిసి నాగార్జున సాగర్‌కు చేరుకుని గేట్లు ఎత్తినీటిని విడుదల చేశారు. ఇక, ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates